– రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవ తెలంగాణ – వనపర్తి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3వ తేదీన జరిగే రైతు దినోత్సవం వేడుకలు జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నాగవరం తాండా రైతు వేదిక దగ్గర ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తో కలిసి పర్యవేక్షించారు. రైతు వేదికలో రైతు దినోత్సవ సంబరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్ల పై దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని విశ్లేషించి పంట కాలాన్ని ఒక రోజు ముందుకు జరపడం పై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం రైతు దినోత్సవం రోజు ఉంటుందన్నారు. ఒకప్పుడు తెలంగాణ రైతులు బీడుపారి మన ప్రాంతం గుండానే కృష్ణ గోదావరి పారుతూ తెలంగాణ ప్రాంతానికి సాగు, తాగు నీరు దొరికేది కాద న్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించాక ప్రశ్నించే గొంతు కలకు తాళం వేస్తూ కల్వకుర్తి లిఫ్ట్, కాళేశ్వరం, తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ఎన్నో పనులు పూర్తి చేసుకొని తెలంగాణ రైతాంగానికి సాగు నీరు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇస్తున్నామన్నారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి సస్యశ్యామలం కాబోతుందని ఇలాంటి విజయాలను గడచిన తొమ్మిది సంవత్సరాల్లో సాధించి పదో సంవత్సరంలో అడుగిడుచున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను రైతు దినోత్సవ వేడుకల నుండే ప్రారంభి స్తున్నట్లు తెలిపారు. ఒకే రోజు అన్ని రైతు వేదికల్లో సంబు రాలు ఘనంగా జరగాలని అధికారులను సూచించారు. 5 వేల మంది రైతులకు సరిపడ అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చే రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ లలో, నడుచుకుంటూ డప్పు, నృత్యాలతో ర్యాలీగా రానున్నట్లు తెలిపారు. రైతులకు కూర్చోడానికి చలువ నీడ, తాగు నీరు, భోజనాలు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. రైతువేదికను అందంగా అలంక రించాలని మామిడి తోరణాలతో పండగ వాతా వరణం సృష్టించాలని సూచించారు. రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్, కలెక్టర్ తేజస్ నందలాల్ ప వార్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, కో ఆపరేటివ్ అధికారిణి కాలిక్రాంతి ఉన్నారు.