సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌కు షాక్‌

సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సిద్దిపేట బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు
నవతెలంగాణ-సిద్దిపేట

సిద్దిపేటకు చెందిన 7వ వార్డ్‌ కౌన్సిలర్‌ ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి, 20వ వార్డు కౌన్సిలర్‌ రియాజుద్దీన్‌, 37 వ వార్డు కౌన్సిలర్‌ సాకి బాల్‌ లక్ష్మి ఆనంద్‌లు సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంత్రి కొండా సురేఖ వారికి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మొదటిసారిగా సిద్దిపేట పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కౌన్సిలర్లు మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి తమతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఎప్పుడైనా, ఏ అవసరమైనా తనను నేరుగా కలవవచ్చని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్‌ పూజల హరికష్ణ, పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్‌ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు కౌన్సిలర్లు ముత్యాల శ్రీదేవి బుచ్చి రెడ్డి, సాకి బాల లక్ష్మి ఆనంద్‌, రియాజుద్దీన్‌లు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి తమ పట్ల కొందరు రెండవ స్థాయి లీడర్లు, ముఖ్యంగా మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చూపిన వివక్ష కారణంగా, పట్టణ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ సంపత్‌ రెడ్డి వైఖరి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనేక విషయాల్లో తమ ఆత్మగౌరవం దెబ్బ తినేలా ప్రవర్తన ఉండడంతో, ఎన్నో అవమానాలు ప్రజల కొరకు ఓర్చుకున్నట్లు తెలిపారు. గత 8 సంవత్సరాల నుంచి 37వ వార్డ్‌లో నిరుపేద దళిత కుటుంబాలకు దళిత బంధు విషయంలో, డబల్‌ బెడరూమ్‌ విషయంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజానర్సు చాలా వివక్ష చూపడం జరిగిందన్నారు. గత 3 సంవత్సరాల నుంచి 7వ వార్డులో డబల్‌ బెడ్‌ రూమ్‌, దళిత బంధు, రేషన్‌ షాప్‌ అడిగినా ఇవ్వకపోవడం, అంగన్వాడీ కేంద్రం ఇవ్వకపోవడం, ఇంకా 1.5 మీటర్స్‌ రోడ్డు వేయకపోవడం, అన్నింటికంటే ఎక్కువగా కనీస గౌరవం కూడా ఇవ్వకుండా తమ ఆత్మ గౌరవం దెబ్బ తినేలా అనేక సందర్భాలలో అవమానించడం జరిగిందని తెలిపారు. 20వ వార్డులో మైనారిటీ బంధు ఇవ్వకపోవడం, రోడ్లు వేయడంలో వివక్ష చూపడం, మైనారిటీ మహిళలకు కుట్టుమిషిన్‌ల పంపిణీ విషయంలో, ఇలా ప్రతి విషయం లో వివక్ష చూపడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం 6 గ్యారంటీలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై, ప్రజా సంక్షేమ పధకాలు తమ వార్డ్‌ ప్రజలకు అందించడానికి, వార్డ్‌లో మిగిలిన అభివద్ధి పనులు జరిపించడానికి, ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు.