తక్షణం రూ.2 లక్షలు రుణమాఫీ చేయండి

– సీఎంకు మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగలేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారంనాడాయన ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్‌ 9 నాడే రూ. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని ఆ లేఖలో గుర్తుచేశారు. మీ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారనీ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా, ఇప్పటి వరకు ఎలాంటి రుణామాఫీ జరగలేదన్నారు. బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసులు ఇస్తున్నాయనీ, ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదనీ, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ ఇచ్చి వేధింపుల నుంచి రైతులకు విముక్తి కలిగించాలని కోరారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్‌ అందక, పంటలు ఎండిపోయి, సకాలంలో నీళ్లు రాక, నాలుగు నెలల్లో 209 మంది అన్నదాతలు చనిపోయారని తెలిపారు. వరి పంటకు మద్దతు ధరపై రూ.500 బోనస్‌, ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి సాయం, పంటపొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ అందించాలని ఆ బహిరంగ లేఖలో డిమాండ్‌ చేశారు.