జీడీపీకి బలాన్నిచ్చిన ఆ ఐదు రాష్ట్రాలు

– మహమ్మారి తర్వాత జాతీయ స్థాయిలో రికవరీకి దోహదం
– జాబితాలో మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు, రాజస్థాన్‌, కేరళ : ఎస్బీఐ నివేదిక
న్యూఢిల్లీ : కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది. అయితే, దేశంలోని ఐదు రాష్ట్రాల పనితీరు దేశ జీడీపీకి బలాన్నిచ్చింది. మహమ్మారి అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. మహారాష్ట్ర, యూపీ నేతృత్వంలోని ఐదు రాష్ట్రాలు.. మహమ్మారి నుంచి జాతీయ జీడీపీకి 235 బేసిస్‌ పాయింట్లను(బీపీఎస్‌) జోడించటం ద్వారా అది కోవిడ్‌కు ముందు ఉన్న 5.7 శాతం నుండి 8.1 శాతానికి పెరిగింది. శతాబ్దపు అత్యంత దారుణమైన విపత్తు తర్వాత సగటు అసమానతలు తగ్గుముఖం పట్టాయి. 2021 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ 23 శాతం, ఆ పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7 శాతం క్షీణించాయి. 2022-24 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశ జీడీపీకి మహారాష్ట్ర అత్యధికంగా 110 బీపీఎస్‌, యూపీ 60 బీపీఎస్‌, తమిళనాడు 70 బీపీఎస్‌, రాజస్థాన్‌, కేరళలు 20 బీపీఎస్‌ చొప్పున అందించాయి.