– సుప్రీంను ఆశ్రయించిన తమిళనాడు
– కేంద్ర వైఖరిపై మండిపాటు
– కపట ప్రేమ చూపుతోందని ఆక్షేపణ
– నిధుల నిలిపివేత హక్కుల ఉల్లంఘనే
– అది చట్టవిరుద్ధం… ఏకపక్షం
న్యూఢిల్లీ : విపత్తు సహాయ నిధుల కోసం, జాతీయ విపత్తుల కోసం ఉద్దేశించిన ఆర్థిక సాయాన్ని విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించా లంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో కర్నాటక కూడా న్యాయస్థానంలో ఇదే రకమైన పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ విపత్తు సహాయ నిధులను కేంద్రం నిలిపివేసిందని తమిళనాడు తన పిటిషన్‌లో ఆరోపించింది. తమిళ నాడు పిటిషన్‌కు ప్రాధాన్యత ఉన్నందున త్వరలోనే విచారణకు వస్తుందని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ, సిబ్బంది వర్గాలు తెలిపాయి.
కరువుతో విలవిలలాడుతున్న కర్నాటకకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం లేదని ఆరోపిస్తూ న్యాయం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో సుప్రీంకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే. కాగా తమకు తక్షణ తాత్కాలిక సాయంగా రూ.2,000 కోట్లు అందించేలా చూడాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఇటీవల సంభవించిన వరదలు, తుఫాను కారణంగా జరిగిన నష్టానికి రూ.35,000 కోట్లు విడుదల చేసేలా కేంద్రాన్ని వెంటనే ఆదేశించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. నివేదికలపై చర్యలు తీసుకోవడంలోనూ, ఆర్థిక సాయం విడుదలకు నిర్ణయం తీసుకోవడంలోనూ కేంద్రం విఫలమైందని తమిళనాడు ఆరోపించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 కింద పౌరులకు లభించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని విమర్శించింది. కేంద్రం చర్య చట్టవిరుద్ధం, ఏకపక్షం అని అభివర్ణించింది.
గతంలో కూడా అనేక సందర్భాలలో సాయం కోసం కేంద్రాన్ని అభ్యర్థించామని, అయితే కేంద్రం మొండిచేయి చూపిందని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్‌లో వివరించింది. తుఫాను, అసాధారణ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రం జంట విపత్తులు ఎదుర్కొన్నదని, అయినప్పటికీ కేంద్రం సాయం అందించి తమను ఆదుకోలేదని తెలిపింది. ‘నిధుల విడుదలలో జాప్యం చేయడం సమర్ధనీయం కాదు. రాష్ట్రాలకు సాయం అందించడంలో తేడా చూపడం వర్గ వివక్షే అవుతుంది. కపట ప్రేమ చూపడం జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని ఉల్లంఘించడమే అవుతుంది’ అని పేర్కొంది. జాతీయ విపత్తుల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసిన అంతర్ మంత్రిత్వ శాఖల బృందం ఇచ్చిన నివేదికపై కూడా కేంద్రం చర్యలు తీసుకోలేదని మండిపడింది. దీనివల్ల రాష్ట్రంలో అభివృద్ధి కార్యకలాపాలకు విఘాతం కలిగిందని, రాష్ట్ర ప్రజలు మానసిక వేదనను, ఇబ్బందులను అనుభవించారని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్‌లో తెలిపింది.