ఆ ఐదు పార్టీలకే 75 శాతం ‘బాండ్ల’ విరాళాలు

ఆ ఐదు పార్టీలకే 75 శాతం 'బాండ్ల' విరాళాలు– పథకానికి ముందు ఇచ్చింది స్వల్పమే
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేడీ…ఈ ఐదు పార్టీలకే 75 శాతం విరాళాలు అందాయి. అయితే ఈ పార్టీలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన కొందరు దాతలు బాండ్ల పథకం రాకముందు… అంటే 2018కి ముందు వాటికి ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. కొద్ది మంది విరాళాలు ఇచ్చినా ఆ మొత్తం స్వల్పమే. ఈ ఐదు పార్టీలలో ప్రతి పార్టీకీ పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన 30 మంది దాతల జాబితాను ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక పరిశీలించింది. 2019 ఏప్రిల్‌ 12, ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 తేదీల మధ్య రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న బాండ్లలో సగానికి పైగా ఈ దాతలు ఇచ్చినవే కావడం గమనార్హం.
బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు కంటే దానిని అమలు చేసిన తర్వాతే తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేడీ పార్టీలకు 16 రెట్లు అధికంగా విరాళాలు అందాయి. పథకం రాకముందు ఈ 30 మంది దాతల్లో ఒక్కరు కూడా తృణమూల్‌, బీజేడీ పార్టీలకు నేరుగా విరాళాలు ఇవ్వలేదు. బీజేపీకి సంబంధించినంత వరకూ ఏడు కంపెనీలు…ఇన్ఫినా ఫైనాన్స్‌, యునైటెడ్‌ ఫాస్ఫరస్‌, టొరంట్‌ ఫార్మా, మోడరన్‌ రోడ్‌ మేకర్స్‌, నవయుగ ఇంజినీరింగ్‌, లక్ష్మీ సివిల్‌ ఇంజినీరింగ్‌…మాత్రం ఆ పార్టీకి 2013-14, 2017-18 మధ్య విరాళాలు అందించాయి. కాగా బీజేపీకి అత్యధిక విరాళాలు ఇచ్చిన మేఘా గ్రూపు ఈ జాబితాలో లేదు.
పథకం ప్రారంభం తర్వాతే విరాళాల వరద
బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఈ ఏడు కంపెనీలు బీజేపీకి రూ.50 కోట్ల విరాళం అందించాయి. బాండ్ల ద్వారా ఇచ్చింది రూ.350 కోట్లు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే ఇద్దరు దాతలు మాత్రం బాండ్లకు ముందు కూడా ఆ పార్టీలకు నిధులు సమకూర్చారు. ఈ రెండు పార్టీలకూ అధిక మొత్తంలో విరాళం ఇచ్చిన మేఘా గ్రూపు ఈ దాతల జాబితాలోనూ లేదు. కాంగ్రెస్‌కు టొరంట్‌ పవర్‌, నిర్మా లిమిటెడ్‌ కంపెనీలు బాండ్ల పథకం రావడానికి ముందు కేవలం రూ.3 కోట్లు విరాళం ఇవ్వగా వచ్చిన తర్వాత రూ.30 కోట్లు అందజేశాయి. బీఆర్‌ఎస్‌కు బాండ్లకు ముందు హెటెరో డ్రగ్స్‌, అరబిందో ఫార్మా కంపెనీలు రూ.1.75 కోట్లు ఇవ్వగా పథకం ప్రారంభించిన తర్వాత రూ.45 కోట్లు అందజేశాయి.
ఎలక్టోరల్‌ ట్రస్టుల ద్వారా…
ఎన్నికల బాండ్ల పథకం ద్వారా బీజేపీ, కాంగ్రెస్‌కు విరాళాలు అందించిన బడా దాతలు దానికి ముందు కూడా నిధులు సమకూర్చినప్పటికీ నేరుగా ఇవ్వలేదు. ఎలక్టోరల్‌ ట్రస్టుల ద్వారా ఆయా పార్టీలకు నిధులు చేరవేశాయి. ఉదాహరణకు కాంగ్రెస్‌ విషయంలో జేకే లక్ష్మి సిమెంట్‌, టొరంట్‌ పవర్‌, హల్దియా ఎనర్జీ కంపెనీలు ఎన్నికల ట్రస్టులకు విరాళాలు ఇచ్చాయి. వాటి ద్వారా 2013-14, 2017-18 మధ్య కాంగ్రెస్‌కు నిధులు చేరాయి. బీజేడీకి అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసిమ్‌ ఇండిస్టీస్‌ సంస్థలు బాండ్ల ద్వారా విరాళాలు అందజేశాయి. అంతకుముందు అవి ఎలక్టోరల్‌ ట్రస్టుల ద్వారా నిధులు సమకూర్చాయి. అయితే ఆ సొమ్ము బీజేడీ ఖాతాలో చేరిందా లేదా అన్నది తెలియలేదు.