మానవత్వానికి మారుపేరు వెంపటి గ్రామం

నవతెలంగాణ – తుంగతుర్తి
సోషల్ మీడియా వేదికగా యువత గ్రామ ప్రజలు ముందుకు రావడం, పార్టీలకు అతీతంగా కలుపుకొని అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహించడం,మండల పరిధిలోని వెంపటి గ్రామం యొక్క ప్రత్యేకత. మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన గోరోజు అశోక్(32) బుధవారం వడదెబ్బతో మృతి చెందారు. వృత్తిరీత్యా అశోక్ లారీ డ్రైవర్,ఇతని తండ్రి చిన్నతనంలో మరణించగా తల్లి, నానమ్మల పోషణ అశోక్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో అశోక్ మరణంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న ఆ ఇద్దరి పరిస్థితి గమనించిన గ్రామ యువకులు సోషల్ మీడియా ద్వారా ముందుకు వచ్చారు. మన ఊరు వెంపటి అనే వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టడంతో సోషల్ మీడియా వేదికగా యువత సంఘటితమై వివిధ వృత్తులలో ఉన్నవారు గ్రామ పెద్దలు, విద్యార్థులు సైతం ముందుకు వచ్చి సుమారు లక్ష రూపాయలను సమకూర్చి మృతుని కుటుంబానికి అందించారు.కష్ట కాలంలో సహాయం అందించిన చిన్ననాటి స్నేహితులను యువకులను గ్రామ పెద్దలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు అభినందించారు.వెంపటి యువత సమాజ సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.