– రబీధాన్యం కొనుగోళుకు ఏర్పాట్లు పూర్తి.
– జిల్లాలో 281 కేంద్రాల ఏర్పాటు..
– జిల్లాలో వరి సాగు విస్తీర్ణం అంచన 3,82,545..
– ధాన్యం దిగుబడి అంచన 8.80లక్షల మెట్రిక్ టన్నులు..
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
రబీసీజన్ దాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు 281 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా 3.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంని నిర్దేశించారు.3,82,545 ఎకరాలలో వరి సాగు యాసంగి సీజన్లో సాగు చేసిన వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో రబీ సాధారణ వరి సాగు 3,85,456 ఎకరాలుగా ఉండగా ఈ సీజన్‌లో 3,82,545 ఎకరాలలు వరి పంట సాగైనట్టు వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు.ఈ సీజన్‌లోహెక్టారుకు సన్న రకాలు 2.2 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకాలు హెక్టారుకు2.4 మెట్రిక్ టన్నుల చొప్పున దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.ఈ లెక్కన జిల్లాలో సాగైన 3,82,545 ఎకరాలలో 8,83,333 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే రైతులు తమ అవసరాల కోసం తమ వద్ద ఉంచుకునే ధాన్యంతో పాటు స్థానికంగా వ్యాపారులకు, మార్కెట్, మిల్లుల్లో విక్రయించే ధాన్యం దాదాపుగా 5,07,721 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంటుదని అంచన. మిగిలిన 3,54,896 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తారని అంచనా వేస్తున్నారు.
281 కేంద్రాల ఏర్పాటు…
వ్యవసాయ శాఖ అంధించిన నివేదిక ప్రకారంగా 3,54,896 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 281 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో సహకార సంఘాల ద్వారా 85 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 183, డీసీఎంఎస్, మెప్మా ల ద్వారా 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర క్వింటాకు రూ.2,203, సాదారణ రకానికి రూ.2,183 చొప్పున కొనుగోలు చేయనున్నారు.
ఏప్రిల్ 1 నుంచి కొనుగోళ్లు అనుకున్న.
ఈ సీజన్ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమైనాయి. కాగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 01 నుంచి ప్రారంబించాలని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే కేంద్రాలు ప్రారంభమైన కొనుగోలు మాత్రం ప్రారంభం కాలేదు. కాగా ఈ మాసంలో 1.24 లక్షల మెట్రిక్ టన్నులు, మేలో 1.41 లక్షల మేట్రిక్ టన్నులు, జూన్‌లో 88.72 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
గత రెండు సీజన్లలో కొన్నది కొంతే..!
2022–23 రబీ, 2023–24 ఖరీప్ సీజన్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎక్కువ శాతం మంది ప్రైవేట్ వ్యాపారుల వైపే మొగ్గు చూపండంతో కొనుగోలు కేంద్రాల లక్ష్యం నెర వేరలేదు. 2022–23 రబీలో జిల్లాలో ధాన్యం సేకరణకు ప్రభుత్వం 271 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. 5.85లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టు కుంది. కానీ 3.61లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించింది. అదే విదంగా 2023–24 ఖరీప్‌లో కూడా అనుకున్న లక్ష్యం చేరలేదు.
4.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ లక్ష్యంగా 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు ఏసి 1.80లక్షల మెట్రిక్ లన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభించామని కొనుగోలులో సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్ నంబర్ 6281492368ను సంప్రదించాలని కలెక్టర్ ఎస్. వెంకటరావు సూచించారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్ ఏ రకం ప్రతి క్వింటాకు రూ. 2,208, సాధారణ రకానికి రూ.2,183 పొందాలని కోరారు. వేసవి దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు, హమాలీలకు మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.