‘ఓటు’ మరవద్దు

– జాబితాలో పేరుందో లేదో తెలుసుకోవాలి
– అందుబాటులో ప్రత్యేక యాప్‌, వెబ్‌సైట్లు
– ఓటును సులభంగా తెలుసుకునే వెసులుబాటు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి ఆయువులాంటిది. నవసమాజ నిర్మాణానికి తిరుగులేని అస్త్రం. అలాంటి ఎంతో విలువైన ఓటును ప్రతి ఎన్నికల్లో వేస్తున్నామని.. ఈసారి కూడా జాబితాలో ఉంటుందిలే అనే ఉదాసీనత వద్దు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఓటుకు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఓటర్లందరిపై ఉంది. జాబితాలో పేరు లేకపోతే, తక్షణమే ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. కొత్తగా ఓటరు నమోదుతో సహా.. మార్పులు, చేర్పులు, సవరణలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియను ఎన్నికల సంఘం నిరంతరం కొనసాగిస్తోంది. అలాగే పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌ ద్వారా లేదా బీఎల్‌, తహశీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొబైల్‌ నెంబర్‌ ఆధారంగా..
www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్తే, సెర్చ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌ రోల్‌ అనే విభాగం కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే, సెర్చ్‌ జై డిటెయిల్స్‌.. సెర్చ్‌ బై ఎపిక్‌ నెంబర్‌.. సెర్చ్‌ బై మొబైల్‌ నెంబర్‌ అనే ఉపవిభాగాలు ఉంటాయి. అందులో సెర్స్‌ బై మొబైల్‌ నెంబర్‌ విభాగంలో ఓటరు రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నమోదు చేయగానే.. ఓటీపీ వస్తుంది. దాన్ని పొందుపరిస్తే ఓటరు వివరాలు కనిపి స్తాయి. మిగతా రెం డు విభాగాల్లో ఓటరు పేరు, తండ్రి పేరు, జిల్లా, ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ ఎంట్రీ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
మొబైల్‌ యాప్‌ పని చేస్తుందిలా..
గూగుల్‌ ప్లే స్టోర్‌లో voter helpline యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఫోన్‌ నెంబర్‌తో రిజిస్టర్‌ చేసుకుని, లాగిన్‌ కావాలి. యాప్‌లోకి ప్రవేశించాక.. సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ ఎలక్ట్రోరల్‌ రోల్‌ విభాగం ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే, సర్ఫ్‌ బై బార్కోడ్‌,సెర్చ్‌ బై క్యూఆర్‌ కోడ్‌, సెర్చ్‌ బై డిటెయిల్స్‌, సెర్చ్‌ బై ఎపిక్‌ నంబర్‌ అనే విభాగాలు కనిపిస్తాయి. మొదటి రెండు విభాగాలకు సంబంధించి ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న బార్‌ కోడ్‌ లేదా క్యూఆర్‌ కోడ్ను స్కాన్‌ చేయడం ద్వారా ఓటరు జాబితాలో పేరుందా లేదా తెలుసు కోవచ్చు. పేరు, తండ్రి పేరు, వయసు, జిల్లా, నియోజకవర్గం తది తర వివరాల ద్వారా యాప్‌లో ఓటరు వివరాలను సరిచూసుకోవచ్చు.
పోలింగ్‌ కేంద్రాల వారీగా జాబితా..
https//-ceotelangana.nie.in లోకి వెళ్తే .. ఎలక్టోరల్‌ రోల్స్‌ విభాగం ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు కనిపిస్తాయి. సంబంధిత నియోజకవర్గం పేరు ఎంచుకుంటే, అన్ని పోలింగ్‌ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్‌ రూపంలో ఉంటుంది. ఏ పోలింగ్‌ కేంద్రం పరిధిలోకి వస్తారో చూసుకుని, జాబితాలో పేరుందా లేదా చూసుకోవచ్చు. అందులోనే సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ ఓటర్‌ లిస్ట్‌ విభాగం ద్వారానూ ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు.
ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య ద్వారా..
http//voterportal.eci.gov.in ఓపెన్‌ చేయగానే.. సెర్చ్‌ ఇన్‌ ఎలక్ట్రోరల్‌ రోల్‌ విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్‌చేసి, ఓటరు గుర్తింపుకార్డు సంఖ్య పొందుపరిస్తే.. జాబితాలో మీ పేరు ఉందా? లేదా? పోలింగ్‌ కేంద్రం.. సీరియల్‌ నెంబర్‌ వివరాలు కనిపిస్తాయి. ఓటరు గుర్తింపు సంఖ్య తెలియకపోతే అడ్వాన్స్‌ సెర్చ్‌ విభాగంలోకి వెళ్లి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జిల్లా, నియోజ కవర్గం వివరాలు పొందుపర్చి, వివరాలను తెలుసుకోవచ్చు.