ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు..

– ప్రతీ ఓటరు తన హక్కును వినియోగించుకోవాలి..
– తహశీల్దార్ క్రిష్ణ ప్లసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట
సమర్థ పాలకులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం పౌరులకు ఓటు హక్కు కల్పించిందని,అటువంటి ఓటును నిర్లక్ష్యం చెయ్యొద్దని తహశీల్దార్ధర్ పి.కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో జి.శ్రీనివాసరావు లు సూచించారు.స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఐసిడిఎస్,సెర్ప్ ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ 18 ఏళ్ళు నిండిన యువతులు, మహిళలకు ఓటు వినియోగంపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గులు, మెహందీ పోటీలు నిర్వహించారు.గెలుపొందిన విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటు హక్కు పొందటంలో యువత వెనుక బడి పోతుందని, రాజకీయాలు,ప్రజా ప్రభుత్వం ఎంపికలో యువత పాత్ర అత్యంత కీలకమని,దీనిని గుర్తించి యువత హక్కును పొందటమే కాకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ యువత ఓటు నమోదులో ముందున్నారని,అదేవిధంగా ఓటు వినియోగంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని స్పష్టం చేశారు.పాలకులను ఎన్నుకోవడంలో సామాన్యుడి చేతిలో ఓటు హక్కు వజ్రాయుధం గా అభివర్ణించారు. కార్యక్రమంలో సీడీపీవో రోజా రాణి,సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, సెర్ప్ సీసీ లు పాల్గొన్నారు.