పసిపిల్లలకు మత విద్వేషపు పాఠాలు

– ఆరెస్సెస్‌ అనుబంధ పాఠశాలల్లో విష ప్రచారాలు
– ఇతర వర్గాలను విలన్లుగా చూపుతున్న వైనం
– చిన్నారుల మెదళ్లను కలుషితం చేస్తున్న కాషాయ సంస్థ
న్యూఢిల్లీ : దేశంలో ఆరెస్సెస్‌ చిన్నారుల మనుసుల్లో విషబీజాలు నాటుతున్నది. వారి మెదళ్లను మతవిద్వేషపు ఆలోచనలతో నింపుతున్నది. హిందూత్వాన్ని చిన్నారులకు బోధిస్తున్నది. ఒక వర్గంవారిని విలన్లుగా చూపిస్తూ చిన్నారుల తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరెస్సెస్‌ అనుబంధ పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. బాల, బాలికలతో ఆరెస్సెస్‌ జరిపే ఇలాంటి కార్యక్రమాలకు ఇటు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇతర అనుబంధ సంఘాల నాయకులు హాజరవుతున్నారు. అయితే, ఆరెస్సెస్‌ చేస్తున్న ప్రయత్నాలు దేశంలో మత సామరస్యానికి ప్రమాదకరమని సామాజికవేత్తలు, పౌర సంఘాల నాయకులు అన్నారు. కాషాయ సంస్థ.. భావి భారత పౌరుల భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్తున్నదని చెప్పారు.
ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో దాదాపు వంద మంది విద్యార్థులు (11, 12వ తరగతులకు చెందినవారు) పాల్గొన్నారు. వీరంతా ఆరెస్సెస్‌ యూనిఫామ్‌ ధరించి.. బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌ మాతాకీ జై, జై శ్రీరామ్‌, జై బజరంగ్‌బలీ నినాదాలను ఆ పిల్లలతో చేయించిన దృశ్యాలు అక్కడ కనిపించాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు తన తుది తీర్పు వెలువర్చిన తర్వాత కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కల్లడ్కలో ఉన్న శ్రీరామ విద్యా కేంద్రం హైస్కూల్‌ డే ఫంక్షన్‌లో ఇది చోటు చేసుకోవటం గమనార్హం. ఇస్లామోఫోబియా, ఇతర అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన, అసహనంతో కూడిన విశ్వాసాలను ఆరెస్సెస్‌ నడుపుతున్న ఒక పాఠశాల తన విద్యార్థులకు ప్రేరేపిస్తున్నట్టు ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు.
నాగ్‌పూర్‌లోని భోన్సాలా మిలిటరీ స్కూల్‌ (బీఎంసీ)లో ఇటీవలి కాలంలో హిందూ తీవ్రవాదుల వివిధ దాడులతో ముడిపడి ఉన్నది. 2008 మాలేగావ్‌ పేలుళ్లు, 2006 నాందేడ్‌ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు సందర్భంగా, మహారాష్ట్ర యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) ఈ విషయాన్ని కనుగొన్నది. దేశంలోని ఆరెస్సెస్‌ అనుబంధ పాఠశాలల్లో ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎదుగుతున్నాయని సామాజికవేత్తలు తెలిపారు.
యూపీలోనూ అనేక ప్రదేశాలలో ఆరెస్సెస్‌ అనుబంధ పాఠశాలలు స్థాపించబడ్డాయి. పాఠశాలల పనితీరును నిర్వహించడానికి, సమన్వయం చేయడానికి, రాష్ట్ర స్థాయి శిశు శిక్షా ప్రబంధక్‌ సమితిని సైతం ఏర్పాటు చేశారు. ఇటు ఢిల్లీ, బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అదేవిధంగా, పంజాబ్‌, చండీగఢ్‌లలో సర్విత్కారి శిక్షా సమితి స్థాపించబడింది. హర్యానాలో హిందూ శిక్షా సమితి ఉన్నది.
1977లో ఈ రాష్ట్ర కమిటీల మధ్య కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, దేశవ్యాప్తంగా ఆరెస్సెస్‌ నిర్వహించే అన్ని పాఠశాలలను నిర్వహించడానికి విద్యాభారతి అఖిల్‌ భారతీయ శిక్షా సంస్థాన్‌ (విద్యాభారతి) పేరుతో అపెక్స్‌ ఆల్‌-ఇండియా బాడీని ఏర్పాటు చేశారు. విద్యాభారతి రిజిస్టర్డ్‌ కార్యాలయం లక్నోలో ఉండగా, ఫంక్షనల్‌ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్నది. దేశంలో ఇప్పటికే దాదాపు 500 ఆరెస్సెస్‌ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 20,000 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పాఠశాలల్లో ఆరెస్సెస్‌ తన భావజాలాన్ని విద్యార్థులపై బలవంతంగా రుద్దుతున్నదని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం హిందూత్వం అజెండాగా ఇవి నడుస్తున్నాయనీ, హిందూయేతర వర్గాలపై విషాన్ని చిమ్మే ప్రచారాన్ని ఈ విద్యాసంస్థలు చేస్తున్నాయని తెలిపారు. అయితే ఇలాంటి పాఠశాలలకు అడ్డుకట్ట పడకపోతే.. అందులో చదివే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నందున సదరు పాఠశాలలపై చర్యలు తీసుకుంటారని ఆశించటం అత్యాశే అవుతుందని తెలిపారు.