– కాళ్లపై పడినా కనికరించని అధికారులు
– సొంత ఇండ్లు నిర్మించి ఇచ్చేదాకా కదలం : బాధితులు
– 2022లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్టాలిన్నగర్ పేరుతో గుడిసెలు
– గుడిసెల కూల్చివేత దుర్మార్గ చర్య :రంగయ్య, సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి
– గ్రేటర్ వరంగల్‌లోని పైడిపల్లి శివారులో గుడిసెల కూల్చివేత
నవతెలంగాణ-కాశిబుగ్గ
గ్రేటర్ వరంగల్ మూడో డివిజన్ పైడిపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలపై పెద్దల కన్ను పడింది. అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల ముసుగులో కొంతమందితో కలిసి కోర్టులో కేసు వేయించారు. దీంతో కోర్టు ఉత్తర్వుల మేరకు శనివారం తెల్లవారు జామున పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పేదల గుడిసెలను కూల్చేశారు. విధ్వంసం సృష్టించారు. స్టాలిన్ నగర్‌గా పేరుపెట్టుకున్న ఆ ప్రాంతం మొత్తాన్ని ధ్వంసం చేసారు. వివరాల్లోకి వెళితే..3వ డివిజన్ పైడిపల్లి శివారులో ఎస్సారెస్పీ కాలువ సమీపంలోని ప్రభుత్వ భూమిలో 2022 ఆగస్టులో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్టాలిన్నగర్ పేరుతో 1650 మంది ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. ఈ క్రమంలో పైడిపల్లి కొత్తపేట గ్రామాల రైతులు కూడా గుడిసెవాసులకు సహకరించారు. కానీ, ఆ భూమిపై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పైడిపల్లి కొత్తపేటలోని కొంతమంది రైతులకు మాయమాటలు చెప్పి కోర్టులో దావా వేయించారు. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గుడిసె వాసులకు ఎలాంటి నోటీసులూ అందించకుండా శనివారం తెల్లవారుజామున సుమారు 500 మంది పోలీసువు, 20 జేసీబీలతో వచ్చి పేదల ఇండ్లను కూల్చేశారు. తమకు సొంత ఇండ్లు లేనందు వల్లే ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నామని.. కొంత సమయం ఇస్తే ఖాళీ చేస్తామని గుడిసె వాసులు కాళ్లావేళ్లా పడినా అధికారులు కనికరించలేదు. ఎదురు తిరిగిన వారిని నిర్ధాక్షిణ్యంగా పోలీసులు లాక్కెళ్లి వ్యాన్‌లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా గుడిసెవాసులు మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కిందట పైడిపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద తాము గుడిసెలు వేసుకున్నామన్నారు. తమకు సొంత ఇండ్లు లేవని, గిరి గిరి చిట్టిలు తీసుకొని సుమారు రూ.50 వేల ఖర్చుతో గుడిసెలు వేసుకొని ఇక్కడే నివసిస్తున్నామని తెలిపారు. స్టాలిన్నగర్ అని పేరు పెట్టుకున్నామని తెలిపారు. పోలీసులు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అకస్మాత్తుగా వచ్చి తమ గుడిసెలను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సొంత ఇల్లు లేకనే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నామని, ప్రభుత్వానికి చేతనైతే తమకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతవరకు తాము ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు.
గుడిసెల కూల్చివేత దుర్మార్గపు చర్య
సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి రంగయ్య
పైడిపల్లి శివారులో వందలాది మంది పేదలు గుడిసెలు వేసుకుని రెండు సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. గత రాత్రి రెవెన్యూ సిబ్బంది పోలీస్ బలగాలతో వచ్చి నిరంకుశంగా ఆ గుడిసెలను కూల్చి వేయడాన్ని ఖండిస్తున్నాం. ఈ భూమి ఎస్సారెస్పీ కాలువ కోసం సేకరించారు. దానికి సంబంధించి భూ యజమానులకు నష్టపరిహారం కూడా చెల్లించారు. ఈ భూమి ఎవరికీ సంబంధించిన పట్టాభూమి కాదు. పూర్తిగా ప్రభుత్వ భూమి. ఒకపక్క పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్పాయి. కాబట్టి ఆ ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెల స్థలాలకు పట్టాలు ఇచ్చి..
పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని.. పేదలందరికీ న్యాయం చేయాలి.