– దేశమంతా ఐదు గ్యారెంటీలు
– మా మ్యానిఫెస్టో ఈ దేశ ప్రజల ఆత్మ
– మోడీ హయాంలో అన్ని వ్యవస్థలు, రంగాలు నిర్వీర్యం
– దేశ సంపద కొందరి చేతుల్లోనే..
– ఇక్కడ మాజీ సీఎం ఫోన్‌ట్యాపింగ్ చేయించారు
– ఢిల్లీలో మోడీ అదే పనిచేస్తున్నారు : తుక్కుగూడ సభలో రాహుల్‌గాంధీ
అసెంబ్లీ ఎన్నికలకు అచ్చొచ్చిన తుక్కుగూడ నుంచే హస్తం పార్టీ లోక్‌సభ ఎన్నికలకు జంగ్ సైరన్ మోగించింది. కొద్ది నెలల క్రితం గెలిచి తీరతాం.. అధికారంలోకి వస్తామంటూ ఆ సభ సాక్షిగా ప్రతినబూని, విజయం సాధించిన ఆ పార్టీ అగ్రనేతలు, మరోసారి అదే రకంగా ఇండియా కూటమి అధికారంలోకి రావటం ఖాయమంటూ నొక్కి చెప్పారు. ప్రధాని మోడీ, ఆయన పార్టీ బీజేపీ వద్ద సీబీఐ, ఈడీలాంటి సంస్థలుంటే, తమ వద్ద ప్రజల పట్ల ప్రేమ, స్వచ్ఛత ఉన్నాయనీ, అవే తమకూ తమ పార్టీకి కొండంత అండంటూ వారు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపారు. సమభావన, సమన్యాయమే తమ అసలు సిసలు సిద్ధాంతాలనీ, ఆ విజయ రహస్యాల ఆధారంగానే ఈసారి ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగరేయబోతున్నామని వారు జోస్యం చెప్పారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశసంపదను ప్రజలందరికీ సమానంగా పంచడమే కాంగ్రెస్ విధానమని ఆపార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇదే విషయాన్ని ‘న్యాయపత్రం’లో పేర్కొన్నా మనీ, అది తమపార్టీకి సంబంధించిన మ్యానిఫెస్టో కాదనీ, దేశ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల్లోంచి ఉద్భవించి న ‘ఆత్మ’ అని స్పష్టం చేశారు. శనివారంనాడిక్కడి తుక్కుగూడలో జరిగిన జనజాతర సభకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ మ్యానిఫెస్టో ‘న్యాయపత్రం’ తెలుగు ప్రతిని ఆవిష్కరించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు ప్రకటించామనీ, అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నామనీ, ఇదే ఆదర్శంతో దేశంలోనూ ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించినప్పుడు ప్రజల అవసరాలను, వారి వాణిని దేశానికి వినిపించామన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం 30వేల ఉద్యోగాలు ఇచ్చి, మరో 50వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నదని చెప్పారు. తెలంగాణలో ఎలాగైతే మాట ఇచ్చి నిలబెట్టుకున్నామో అదే విధంగా దేశంలో అమలు చేస్తామన్నారు. నిరుద్యోగులందరికీ ఏడాదికి రూ.లక్ష జీతంతో ఉద్యోగం, అప్రంటీస్షిప్ ఇస్తామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ యువతకు ఎలాగైతే ఉపాధి కల్పిస్తున్నామో, అదే విధంగా లక్ష రూపాయల జీతంతో అన్ని రంగాల్లోనూ శిక్షణ, అప్రంటీస్షిప్ కల్పిస్తామని వివరించారు. దేశంలోని మహిళలు మన భవిష్యత్ చూసుకుంటారు. మహిళలు ఇంటిపని, ఉద్యోగ,ఉపాధి వంటి రెండు పనులు ఏకకాలంలో చేస్తున్నారని చెప్పారు. దేశంలో మోడీ సర్కారు వచ్చాక ప్రజలు మళ్లీ నిరుపేదలు అయ్యారనీ, వారి కోసం నారీన్యారు తెస్తున్నామన్నారు. ప్రతిఒక్క మహిళ బ్యాంకు ఖాతాలో ఏటా రూ.1లక్ష ఇస్తామనీ, దీనివల్ల సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చి దేశ ముఖచిత్రం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కిసాన్ న్యారు ద్వారా రైతులకు న్యాయం చేస్తామన్నారు. దేశంలో రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, మోడీ సర్కార్ ధనవంతులకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ కమిటీ సిఫార్సుల ఫార్ములా ప్రకారమే రైతులకు లబ్ది చేకూరుస్తామని వివరించారు. శ్రామిక్ న్యారులో భాగంగా కార్మికులకు కనీస వేతనాలు తెస్తామనీ, ఉపాధి హామీ కింద రోజుకు రూ.400 ఇస్తామనీ, ఇతర పనులనూ ప్రకటిస్తామని తెలిపారు. దేశంలో 50 శాతం జనాభా వెనుకబడిన తరగతులకు చెందినవారు ఉన్నారనీ, వారిలో 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, ఆదివాసులు, 15 శాతం మైనార్టీలు, 5 శాతం నిరుపేదలు జనరల్ కేటగిరిలో ఉన్నారని చెప్పారు. ఈ కేటగిరిలోకే 90 శాతం జనాభా వస్తారనీ, కానీ వీరెవరూ ఏ వ్యవస్థలోనూ వ్యవస్థలో కనిపించరని అన్నారు. మీడియా కంపెనీ యజమానుల్లో ఎవరూ వెనుకబడిన తరగతుల వారు లేరనీ, అదే పరిస్థితి ఇతర కంపెనీల్లోనూ ఉందన్నారు. దేశాన్ని 90 మంది ఐఏఎస్‌లు నడుపుతుంటే, వారిలో కేవలం ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారనీ, కానీ జనాభాలో వారు 50 శాతంగా ఉన్నారని విశ్లేషించారు. గిరిజనుల్లో ఒక్క ఐఏఎస్, ముగ్గురు దళితులు మాత్రమే ఉన్నారని చెప్పారు. బడ్జెట్లో వంద రూపాయల ఖర్చులో కేవలం రూ.6 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ అధికారుల కోసం ఖర్చు చేస్తున్నారనీ, సంపద సమానంగా పంపిణీ జరగట్లేదని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ తరహాలో దేశంలోనూ కుల గణన చేపడతామనీ, దేశాన్ని ఎక్స్‌రే తీసి, ఆర్థిక సంస్థల సర్వే చేసి పాలు-నీళ్లు వేర్వేరు చేస్తామన్నారు. దేశ సంపద ఏ వర్గం చేతిలో ఉన్నదో నిగ్గు తేలుస్తామని హెచ్చరించారు. విప్లవాత్మక మార్పులు తెస్తూ, ప్రజల హక్కుల్ని వారికే ఇస్తామని చెప్పారు. మీడియా, బ్యూరోక్రసీ, దేశంలోని అన్ని సంస్థల్లో జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మాజీ సీఎం ప్రభుత్వాన్ని ఎలా నడిపారో ప్రజలకు తెలుసనీ, వేలాదిమంది ఫోన్లు ట్యాపింగ్ చేసి, బ్యాంకులు, ఇంటలిజెన్స్, పోలీస్ వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారన్నారు. ప్రభుత్వం మారగానే ఆ డేటా మొత్తం ధ్వంసం చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజల్ని భయపెట్టి, సమాజాన్ని ఆందోళనలోకి నెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో మాజీ సీఎం చేసిన పనులనే ఢిల్లీలో నరేంద్రమోడీ ప్రభుత్వం కూడా చేస్తున్నదని ఆరోపించారు. ఈడీ బలవంతపు వసూళ్ల సంస్థగా మారిందన్నారు. బీజేపీ దేశంలోనే అతిపెద్ద వాషింగ్ మెషిన్‌ను నడిపిస్తున్నదనీ, ఎన్నికల కమిషన్‌లో కూడా తన వ్యక్తుల్ని పెట్టారని చెప్పారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమనీ, పైసలు ఇచ్చి పనులు తీసుకొనేలా వ్యవస్థను మార్చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐ ఎప్పుడైతే ఏ సంస్థను భయపెడుతుందో, అదే నెల ఆ కంపెనీ ఎలక్ట్రోరల్ బాండ్స్ పేరుతో బీజేపీకి డబ్బు చెల్లిస్తుందనీ, దేశంలో మౌలిక వసతుల కల్పన కాంట్రాక్టుల్ని ఇలాంటి వారికే ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బీ టీంను ఓడించామనీ, ఇప్పుడు దేశంలో ‘ఏ’ టీంను ఓడిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగం దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తుందనీ, బీజేపీ ఆ రాజ్యాంగాన్నే మార్చే ప్రయత్నం చేస్తున్నదనీ, కానీ అలా జరగనివ్వబోమని స్పష్టం చేశారు. తమది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనే ప్రయత్నమని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ 3, 4 శాతం ఉన్న పెద్దల కోసమే పనిచేస్తున్నారనీ, ఆయన దగ్గర మీడియా, సీబీఐ, ఈడీ వంటివి ఉన్నాయన్నారు. తమ దగ్గర కేవలం ప్రజల ప్రేమ, ఆశీస్సులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మత్య్సకారులకు డీజిల్ సబ్సిడీ ఇస్తామనీ, వారి కో ఆపరేటివ్ సొసైటీలకు తక్కువ ధరకు రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. యువకులు, మహిళలు, రైతులు, కూలీలు, వెనుకబడిన తరగతులవారి కోసం మరో ఐదు హామీలు ఉన్నాయనీ, ఇది దేశ ముఖచిత్రాన్ని మారుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మ్యానిఫెస్టో దేశ ప్రజల ఆత్మ అనీ, వారి బాధలు విని దీన్ని రూపొందించామని చెప్పారు. తనకు, ప్రజలకు ఉన్నది కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదనీ, ప్రేమ ఆత్మీయతలతో కూడిన కుటుంబ సంబంధమని అన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు తోడుగా నిలిచారనీ, ఢిల్లీలో తానూ ప్రజల కోసం పోరాడే సైనికుడిగానే ఉంటాననీ, రాష్ట్రంలో చిన్న పిల్లలు పిలిచినా మీకోసం వచ్చేస్తానని భరోసా ఇచ్చారు. తాను బతికున్నంతకాలం మీ ముందే ఉంటాననీ, సేవ చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందనీ, మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రజల కలల్ని కాలరాసారని విమర్శించారు. దేశానికి తెలంగాణ దారి చూపాలనీ, అందరం ఒక్కటై కలిసి పనిచేద్దామన్నారు. మేడిన్ తెలంగాణ అనే బ్రాండ్ మేడిన్ చైనా కంటే పెద్దగా కావాలనీ, అదే తరహాలో మేడిన్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రావాలని ఆకాంక్షించారు. బీజేపీ దేశంలో విద్వేషాన్ని నింపుతోందనీ, మతాల మధ్య కొట్లాటలు పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ రాష్ట్రంలో ప్రజలంతా ప్రేమతో కలిసిమెలిసి ఉంటారనీ, ఇదే సందేశం రాష్ట్రం నుంచి దేశానికి వెళ్లాలని ఆకాంక్షించారు.