– ఉచిత ఇసుక విధానం పునరుద్ధరిస్తాం
– పాలనా వ్యవస్థను గాడిలో పెడతాం
– సత్తెనపల్లి, పెదకూరపాడు సభల్లో చంద్రబాబు
గుంటూరు: అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుకతో నిర్మాణ రంగాన్ని నిలబెడతామని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు. గాడి తప్పిన పరిపాలన వ్యవస్థను గాడిలో పెడతామని అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు, సత్తెనపల్లిలో శనివారం రాత్రి జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో రూ.13 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు, ఇతరులకు లక్షన్నర కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారని తెలిపారు. పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాలనను గాడిలో పెడతానన్నారు. వైసిపి నాయకులు ఇసుకను దోచేసి లక్షల మంది కార్మికుల పొట్టగొట్టారని విమర్శించారు. ఇసుక దోపిడీతో 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారన్నారు. ఇసుక బకాసురుడు పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావు లాంటి వారు వల్ల భవన నిర్మాణ రంగం బాగా నష్టపోయిందని విమర్శించారు. తల్లి కాంగ్రెస్ పోటీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నారు. జగన్‌ను వ్యతిరేకిస్తున్న షర్మిల, సునీతల అంశం వారి కుటుంబ వ్యవహారమని పేర్కొన్నారు. తండ్రి హత్యపై పోరాడుతున్న సునీత… షర్మిలకు మద్దతుపై పునరాలోచించుకోవాలన్నారు. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం పదేళ్ల నుంచి ఉందని, మళ్లీ రాబోయేది ఎన్‌డిఎనని, అందుకే బిజెపి, టిడిపి, జనసేన జట్టుకట్టాయని వివరించారు. వైసిపి ప్రభుత్వంలో మైనారిటీలకు అన్యాయం జరిగిందన్నారు. తాము ఎన్‌డిఎ ఉన్నా ఏ ఒక్క ముస్లిం, మైనారిటీకీ అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. ఎన్‌డిఎతో 1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకూ కలిసే ఉన్నామన్నారు.