– అభం శుభం తెలియని విద్యార్థినుల పట్ల.. పలువురి ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన
– గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించే సమయంలో.. వెలుగులోకి వస్తున్న ఉపాధ్యాయుల తీరు
– వారిలో నైతిక విలువలు పెంపొందించేలా.. శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని పలువురి సూచనలు
నవతెలంగాణ-లింగంపేట్
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో ఓ గ్రామంలోని పాఠశాలలో పని చేస్తున్న ప్రవీణ్ అనే ఉపాధ్యాయుడు.. విద్యార్థినులను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ.. ఒంటరిగా తీసుకెళ్తూ పత్రికలో రాయలేని విధంగా అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇటీవల ఫోక్సో కింద కేసు నమోదు కావడంతో సస్పెండ్ అయ్యారు.
ఈ ఘటన మరువకముందే.. 15 రోజుల వ్యవధిలో లింగంపేట్ మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీనివాస్ శర్మ విద్యార్థినులతో కాకుండా ఉపాధ్యాయినీలతో సైతం అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల సమక్షంలో రెండు నెలల క్రితం పద్దతి మార్చుకోవాలని హెచ్చరిక సైతం చేశారు. దాంతో సదరు ఉపాధ్యాయుడు స్కూళ్లో ఉన్న బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. మద్యం తాగి విధులకు వస్తూ విద్యార్థుల భుజం మీద చేతులు వేయడం, దగ్గరికి తీసుకోవడం లాంటి పనులు చేసినట్టు సమాచారం. దాంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బిచ్కుందలో సైతం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా.. సదరు ఉపాధ్యాయుడిని స్థానికులు చితకబాదారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో సైతం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంది.
ఇలాంటి ఎన్నో ఘటనలు ఇటీవల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. బావిభారత పౌరులను తీర్చేదిద్దాల్సిన కొందరు ఉపాధ్యాయులు.. వారి వృత్తికే మాయని మచ్చగా మారుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి.. అభం శుభం తెలియని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కీచకులుగా మారుతున్నారు. గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌పై స్కూళ్లల్లో అవగాహన కల్పిస్తున్న సమయాల్లో విద్యార్థినులు తమ బాధలను చెప్పుకుంటూ బోరుమంటున్నారు. పలువురు ఉపాధ్యాయులు తమతో అదే విధంగా ప్రవర్తిస్తున్నట్టు వాపోతున్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 24 మండలాల్లో 1257 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఒక లక్షా పదివేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారికి 3800 మందికిపైగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. నేటి సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి చాలా గౌరవం ఉన్నది. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైంది. విద్యార్థిని విద్యార్థుల దశ దిశ మార్చేది వారే. కానీ కొంతమంది ఉపాధ్యాయులు తమ విలువను దిగజార్చుకుంటూ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో రోజురోజుకూ ఉపాధ్యాయుల నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. ఇలాంటి ఘటనల్లో పలువురు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నా, ఉపాధ్యాయులను చితకబాది చర్యలు తీసుకున్నా.. ఇప్పటివరకు వారి తీరుమాత్రం మారడం లేదు.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌తో ఉపాధ్యాయుల తీరు వెలుగులోకి..
షీ టీం ఆధ్వర్యంలో ఇటీవల స్కూళ్లలో విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుడ్ టచ్, బ్యాట్ టచ్‌పై విద్యార్థినులకు విశదీకరిస్తూ చెప్తుండటంతో.. పలువురు విద్యార్థినులు షీ టీం ఎదుట బోరున విలపిస్తున్నారు. తమను ఉపాధ్యాయులు అదే విధంగా టచ్ చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. నాగిరెడ్డిపేట్‌లో ప్రవీణ్, లింగంపేట్‌లో శ్రీనివాస్‌శర్మ తీరు షీ టీమ్ ద్వారానే వెలుగులోకి వచ్చింది. ఆయా స్కూళ్లలో అవగాహన కల్పించినప్పుడు విద్యార్థినులు సదరు ఉపాధ్యాయుల తీరుపై వివరించడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టి ఉపాధ్యాయ ముసుగులో ఉన్న కీచకలపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాలకు పంపారు.
మారుమూల ప్రాంతాల స్కూళ్లల్లో పెరుగుతున్న ఘటనలు..
ఎంఈవోల కొరత, ప్రధానోపాధ్యాయులకు క్లస్టర్ బాధ్యతలు ఇవ్వడంతో మారుమూల గ్రామాల్లోని స్కూళ్లల్లో పర్యవేక్షణ కొరవడింది. దాంతో పలువురు ఉపాధ్యాయులు చదువు చెప్పడంలో శ్రద్ద చూపెడుతూ దారితప్పి తప్పటడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు వెలుగుజూసిన ఘటనలు ఎక్కువగా మారుమూల గ్రామాల్లో చోటుచేసుకున్నవే. కొంతమంది బాలికలు బయటకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. మరికొన్ని పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు.
ఉపాధ్యాయుల్లో నైతిక విలువలు పెంచాలి
విద్యాశాఖాధికారులు స్పందించి ఉపాధ్యాయులకు వృత్తి, నైతిక విలువలపై ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి. అప్పుడైనా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నివారించే అవకాశం ఉంది. అధికారుల పర్యవేక్షణ లేక పలువురు ఉపాధ్యాయులు మద్యం సేవించి మరీ విధులకు హాజరవుతున్నారు. పలుసార్లు మందలించినా వారి ప్రవర్తన మార్చుకోలేదు. విద్యార్థి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం. వృత్తి ధర్మం, ప్రవర్తన, ఉపాధ్యాయ శైలి, బోధన విధానం, విద్యార్థినీ విద్యార్థుల పట్ల మాట్లాడే విధానంపై ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
షీ టీమ్ పనితీరు కీలకం
పోలీస్ శాఖ సైతం స్పందించి షీ టీమ్‌లను మరింత మెరుగుపరిచి ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లల్లో నిరంతరం గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి. విద్యార్థినుల్లో మానసిక స్థైర్యం పెంపొందించేలా.. ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ విషయం ప్రధానోపాధ్యాయుల దృష్టికి, కుటుంబీకుల దృష్టికి తీసుకెళ్లాలా వారికి అవగాహన కల్పించాలి. అప్పుడే ఇలాంటి కీచకుల ఆటకట్టించవచ్చు. అదే విధంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకొని, వారిపై తీసుకుంటున్న కఠిన చర్యలను ఎప్పటికప్పుడు బహిరంగంగా ప్రకటిస్తే.. కీచకల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.