– మరమ్మతులు చేస్తుండగా చెలరేగిన మంటలు
– పరుగులు పెట్టిన సిబ్బంది
– మంటలను అదుపు చేసిన ఫైర్ఇంజన్లు
నవతెలంగాణ-గండిపేట్
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో ప్రారంభానికి సిద్ధమవుతున్న రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ సన్సిటీలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో మరమ్మతులు చేస్తుండగా మంటలు చెలరేగాయి. మంటలతో దట్టమైన పొగ వ్యాపించడంతో రత్నదీప్ యాజమానులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అలాగే నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనలో స్టోర్ ప్రారంభానికి తీసుకు వచ్చిన వస్తువులు, ప్లాస్టిక్ కుర్చీలు, టేబుల్స్, ఇతర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైపోయాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ప్రవీణ్ కుమార్రెడ్డి తెలిపారు. అయితే రత్నదీప్ సూపర్ మార్కెట్ యజమాన్యం ఎలాంటి ఫైర్ నిబంధనలను పాటించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు.