ఆప్‌ను ఖతం చేసేలా బీజేపీ కుట్ర

ఆప్‌ను ఖతం చేసేలా బీజేపీ కుట్ర– కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసన.. సామూహిక నిరహార దీక్షలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆమ్‌ ఆద్మీపార్టీ (ఆప్‌)ని అ ంతం చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా.. దేశవ్యాప్తంగా నిరసనలు.. సామూహిక నిరాహార దీక్షలు చేశారు. ఆదివారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆందోళన నిర్వహించారు. ఢిల్లీ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, రాజస్థాన్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌, జార్ఖండ్‌, కర్నాటక తదితర రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తాయి. ఆదివారం జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేపట్టారు. రాజ్యసభ ఎంపీ సంజరు సింగ్‌, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌నివాస్‌ గోయల్‌, డిప్యూటీ స్పీకర్‌ రాఖీ బిల్లా, మంత్రులు అతిషి, గోపాల్‌ రారు, సౌరబ్‌ భరద్వాజ్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌, ఎంపీ సందీప్‌ పాఠక్‌, సీనియర్‌ నేత సోమనాథ్‌ భారతితోపాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
బీజేపీ కుట్రలను తిప్పి కోడదాం..
ఆమ్‌ ఆద్మీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడం కోసమే బీజేపీ ఈ తరహా కుట్ర పన్నిందని మంత్రి గోపాల్‌రారు విమర్శించారు. అందులో భాగంగానే ఢిల్లీ మద్యం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసిందన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌నివాస్‌ గోయల్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మద్దతుపలికేవారంతా ఈ రోజు నిరాహారదీక్ష చేపడుతున్నారని అన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయా ప్రభుత్వాలను కూలదోసేవారిపై పోరాటం ఆరంభమైందని, తాము భారత రాజ్యాంగాన్ని కాపాడతామని స్పష్టం చేశారు. కాషాయ పాలకులు ఆప్‌ను చీల్చాలని కోరుకుంటున్నారని, అయితే తాము మరింతగా బలపడతామని దీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియులు అరవింద్‌ కేజ్రీవాల్‌కు బాసటగా నిలుస్తున్నారని తెలిపారు.మరోవైపు అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా దేశ విదేశాల్లో ఆప్‌ నేతలు ఈ తరహా నిరాహార దీక్షలు చేపట్టారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి, ఆప్‌ నేత భగవంత్‌ సింగ్‌ మాన్‌ ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు భగత్‌ సింగ్‌ స్వగ్రామం కత్‌కర్‌ కలాన్‌లో దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షకు ప్రజలు పోటెత్తారు. విదేశాల్లో సైతం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా ఈ దీక్షలు చేపట్టారు. బోస్టన్‌లో హార్వర్డ్‌ స్క్వేర్‌, లాస్‌ ఏంజెల్స్‌లోని హాలీవుడ్‌ సైన్‌, వాషింగ్టన్‌ డీసీలోని ఇండియా రాయబార కార్యాలయం వెలుపల, న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌, టోరంటో, లండన్‌, మెల్‌బోర్న్‌లలో ఈ నిరాహార దీక్షలు చేపట్టినట్టు ఆప్‌ నేతలు వివరించారు. ఇక ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడి అరెస్ట్‌ చేసి, ఆయన జ్యూడిషియల్‌ కస్టడినీ ఏప్రిల్‌ 15వ తేదీ వరకు పొడిగించిన విషయం విదితమే.