మసీదు కమిటీ పిటిషన్‌ కొట్టివేసిన అలహాబాద్‌ హైకోర్టు

వారణాసి: జ్ఞానవాపి మసీదు కేసులకు సంబంధించిన ఓ అంశంలో మసీదు కమిటీకి చుక్కెదురయ్యింది. శృంగార గౌరీ ఆలయంలో నిత్యం పూజలు చేసుకోవడంపై కొందరు హిందూ మహిళలు స్థానిక కోర్టులో వేసిన పిటిషన్‌ను రద్దు చేయాలని మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది. వారణాసి జిల్లా కోర్టులో వారు వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్సులో ఉన్న శృంగార గౌరీతో పాటు ఇతర ఆలయాల్లో నిత్యం పూజలు చేసుకునే హక్కు ఉందంటూ ఐదుగురు హిందూ మహిళలు స్థానిక కోర్టులో ఆగస్టు 2021లో సివిల్‌ సూట్‌ దాఖలు చేశారు. ఇది విచారణకు అర్హమైనదని వారణాసి జిల్లా కోర్టు సెప్టెంబర్‌ 2022లోనే పేర్కొంది. అయితే, దీనిని అంజుమన్‌ ఇంతెజామియా కమిటీ వ్యతిరేకించింది. ఇలా హిందూ మహిళలు వేసిన పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ అంజుమన్‌ ఇంతెజామియా కమిటీతోపాటు యూపీ సన్నీ వక్ఫ్‌బోర్డు అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనికి సంబంధించిన వాదనలు 2022 డిసెంబర్‌ 23లో హైకోర్టులో ముగిశాయి. తీర్పును రిజర్వులో ఉంచిన అలహాబాద్‌ హైకోర్టు.. తాజాగా దానిని వెలువరించింది.