ఉగాది గేయం

తెలుగుసంవత్సాది క్రోధి
ఉ..
పచ్చనితోరణాలు మనవాకిలు లన్నిట శోభలీనగా
వెచ్చని పిల్లవాయువులు వీయుచునుండగ మత్తకోకిలల్
పొచ్చెములేక కూయుచు ప్ర పూర్ణ యశస్సులనింపగానహో
వచ్చెనుగాది పండుగయు వైభవ లక్ష్మియెవెంటరాగనో
చం..
 యుగమునకాది పబ్బము మహోన్నతమైన విశేషవేడ్కగా
ప్రగతికిమూలమై వరలు రమ్య వసంతపు శోభవృక్షముల్
చిగురులువేసి పచ్చగను చెన్నలరారగ చల్లగాలి స
న్నగనిల వీయుచుండ మది నందముగూర్పు నుగాదికిన్నతుల్
సీస..
 క్రోధి వత్సరము సంక్షోభను బాపియు
సంపదల్ గూర్చును సర్వులకును
మదమత్సరము లుడ్గి మర్యాద పెంపొంది
శివము చేకూర్చును చెలువు మీర
వర్షముల్ గురిసియు వాగులు వంకలు
పారగ జోరుగ పల్లెసీమ
పాడి పంటలతోడ పరవశ మొందుచు
సౌభాగ్య లక్ష్మితో ప్రాభవముగ
గీ..
ప్రేమభావంబు బొంగగ బీదసాద
ప్రజలు ధనవంతులనియెడి బేధ భావ
ముడిగి యందరమొక్కటే యొడి యటంచు
వరలు చుందురు క్రోధిసంవత్సరమున…
                                                    – బండకాడి అంజయ్య గౌడ్.