– కాలర్లు పట్టుకొని తన్నుకున్న కార్యకర్తలు
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. ఇటీవల ఎర్రబెల్లి స్వర్ణను అధిష్టానం పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వరంగల్ తూర్పు నియోజకవర్గం పోచమ్మ మైదాన్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్గీయుల్లో మాట మాట పెరిగి కాలార్లు పట్టుకొని తన్నుకున్నారు. అంతేకాకుండా చెప్పులు విసురుకోవడంతో ప్రమాణ స్వీకారం గందర గోళంగా మారింది. మూడు నియోజకవర్గాల నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ, కొండా మురళి, దొంతి మాధవరెడ్డి అనుచరులు తోపులాడుకోవడం చూసిన నాయకులు వరద రాజేశ్వర్ రావు, జంగ రాఘవ రెడ్డి, దొంతి మాధవరెడ్డి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నం చేసినా సద్దుమణకపోవడం గమనార్హం. కాగా, స్వర్ణకు అధ్యక్ష పదవి రావడం ఇష్టం లేకనే కార్యకర్తలను ఉసిగొల్పి గందర గోళం చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అనాసక్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో నాయకుల మధ్య గ్రూపు తగాదాలు రచ్చకెక్కడం పార్టీని మరింత బలహీన పరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ గొడవకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని వరద రాజేశ్వర్ రావు హెచ్చరించారు.