రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌ ఉగాది శుభాకాంక్షలు

– కేసీఆర్‌, భట్టి సహా పలువురి విషెస్‌..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలనీ, ప్రజల ఆశలు, ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఉజ్వల భవిష్యత్తుకు ఈ ఉగాది తోడ్పడాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాదినుండి కాలచక్రం తిరిగి మొదలవుతుందనీ, చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో నూతనోత్తేజం నెలకొంటుందన్నారు. వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభిస్తారనీ, అందువల్లే ఉగాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా పిలుచుకోవడం ప్రత్యేకతని తెలిపారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీశ్‌రావు తదితరులు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.