ప్రతిపక్షాలు కలిస్తే బీజేపీ ఓటమి ఖాయం

– ప్రత్యామ్నాయ విజన్‌ కూడా అవసరమే : అమెరికా పర్యటనలో రాహుల్‌
శాంటాక్లారా : ప్రతిపక్షాలు సరిగా కలిస్తే బీజేపీ ఓటమి ఖాయమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. ప్రతిపక్షాల మధ్య పొత్తు కోసం తాము కృషి చేస్తున్నామనీ, తమ ప్రయత్నాలు సజావుగా సాగుతున్నాయని ఆయన అన్నారు. ఇటీవల కర్నాటకలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ సాధించిన విజయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీ సిలికాన్‌ వ్యాలీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆహుతులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ బీజేపీ బలహీనతలను తాను స్పష్టంగా చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఏకమైతే బీజేపీ పరాజయం తప్పదని చెప్పారు. కర్నాటకలో బీజేపీతో పోరాడి కాంగ్రెస్‌ విజయం సాధించిందనీ, అయితే ఆ ఎన్నికలలో తాము ఉపయోగించిన అస్త్రాలు ఎవరికీ అర్థం కాలేదని రాహుల్‌ తెలిపారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ పూర్తి భిన్నమైన వైఖరి అవలంబించిందని అన్నారు. భారత్‌ జోడో యాత్ర కూడా తమ విజయానికి బాటలు వేసిందని చెప్పారు. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్‌ పెట్టిన ఖర్చు కంటే బీజేపీ పది రెట్లు ఎక్కువ ఖర్చు చేసిందని తెలిపారు. దేశంలో బీజేపీని ఓడించాలంటే ప్రత్యామ్నాయం అవసరమని, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని అభిప్రాయపడ్డారు. కేవలం ప్రతిపక్షాలు ఏకమైతే సరిపోదని, ఆ పార్టీకి ఓ ప్రత్యామ్నాయ విజన్‌ కూడా అవసరమని రాహుల్‌ చెప్పారు. అందులో తొలి అడుగుగా భారత్‌ జోడో యాత్ర నిలుస్తుందని అన్నారు. ఈ యాత్ర పట్ల ప్రతిపక్ష పార్టీలు అసమ్మతి వ్యక్తం చేయలేదని చెప్పారు.
ప్రధానమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిర్ణయిస్తారని ఒక ప్రశ్నకు జవాబుగా రాహుల్‌ చెప్పారు. దేశంలో ప్రతి ఒక్క పౌరుడి అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడుతూ అది ప్రజలను భయపెడుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని చెప్పారు. ప్రజలతో మమేకం కావడానికి అవసరమైన సాధనాలన్నింటినీ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ గుప్పెట్లో పెట్టుకున్నాయని, అందుకే పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నానని రాహుల్‌ అన్నారు.