ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం!

Let's save democracy!భారతదేశ పార్లమెంటుకు ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో మే13వ తేదీన జరగబోతున్నాయి. పార్టీలూ, నాయకులూ ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. ఈ ఆట ఎప్పుడూ ఉండేదే. ప్రస్తుత అధికార బీజీపీ పార్టీ మళ్లీ గెలిస్తే ఇక నియంతృత్వమే ప్రారంభమవుతుందని విశ్లేషకులు ఇప్పటిదాకా భావించారు. కానీ ఆ పార్టీ, ఎన్నికలు పూర్తయ్యేదాకా కూడా ఆగటం లేదు. ప్రతిపక్ష పార్టీలను ఎన్నికల పోటీలోనే లేకుండా చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటమా? నియంతృత్వంలోకి జారిపోవటమా? రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకుని, ఓటు వేయాల్సిన సందర్భంలో ప్రజలు ఉన్నారు. అయితే, పొద్దున లేస్తే పొట్ట తిప్పలతోనో, చదువో, ఉద్యోగ వేటలోనో జీవితం గడిచిపోయే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారత రాజకీయాల్లోని ఎంతో లోతైన విషయాలను విశ్లేషించుకుని, తగిన నిర్ణయం తీసుకోవటం సాధ్యపడుతుందా అనే అనుమానం కలుగుతుంది. నిజంగా, ఇది చాలా వరకు ఒక ఆటంకమే. అయినప్పటికీ, ప్రజల రాజకీయ వివేక చరిత్రా, తిరుగుబాట్ల చరిత్రా ఏమంత తక్కువది కాదు. అలాగే, మరొక ఆటంకం కూడా ఉంది. బ్రిటీషు పరిపాలనా కాలంలో చాలా కాలం ఇక్కడ పనిచేసి బ్రిటన్‌కు వెళ్లిపోయిన ఒక అధికారిని అక్కడి పత్రికల వాళ్ళు మీరు భారత దేశంలో ప్రత్యేకంగా ఏం గమనించారని అడిగిన ప్రశ్నకు, ‘భారతీయులు పుకార్లను బాగా నమ్ముతారు’ అని సమాధానం ఇచ్చాడు. ఈ ఆరోపణ ఈ రోజుకీ వర్తించే పరిస్తితి ఉండటం ఒక విచారకరమయిన వాస్తవం. ప్రజల ఈ బలహీనత మీద ఆధారపడే కొన్ని పార్టీలు వారి రాజకీయ పునాదిని నిర్మించుకున్నాయి. కాబట్టి పుకార్లను, ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాల మధ్య ఉండే విభేదాలను వైషమ్యాలుగా మార్చే పుకార్లను, నమ్మకుండా ఉండటం మాత్రమే కాదు, ఉద్దేశ్య పూర్వకంగా వాటికి కారణమయ్యే వారిని సామాజిక ద్రోహులుగా పరిగణించటం ఇప్పుడు అందరికీ చాలా అవసరం.
డా.అంబేద్కర్‌ నాయకత్వంలో ప్రస్తుత రూపుదిద్దుకున్న రాజ్యాంగంలో ఇతర అధికరణాల కంటే రాజ్యాంగ పీఠిక, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల అధ్యాయాలే చాలా కీలకం. సామాన్య ప్రజానీకానికి కావాల్సిన రాజ్యాంగ సూత్రాలన్నీ ఈ మూడు భాగాల్లోనే ఉన్నాయి. ఏ పార్టీ అయినా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకోవాలంటే పై మూడింటికి లోబడే పని చేయాలి. అదే, ప్రధాన రాజ్యాంగ స్వరూపం. కానీ, ఈ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఊహించుకున్నంత ఆదర్శంగా ఏనాడూ ఆచరణలో లేవు. గత పదేండ్లలో పరిస్థితి పూర్తిగా విషమించింది. కేంద్ర ప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపిస్తున్న ఆరెస్సెస్‌ అయితే ప్రజాస్వామ్యాన్ని, లౌకివాదాలను విదేశీ భావనలు అంటున్నది. ‘ఈ రాజ్యాంగంలో ఏముంది? మనదేశానికి ఎప్పటినుండో ఒక రాజ్యాంగం (మను ధర్మం) ఉంది, అదే మనకు శిరోధార్యం’ అని చెబుతున్నది. మనసులో ఇటువంటి ఉద్దేశాలు పెట్టుకుని సాగిన తాజా పదేండ్ల పరిపాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సౌధాలు యధేచ్చగా కూలగొట్టబడ్డాయి. ఆర్‌బీఐ, ఎలక్షన్‌ కమిషన్‌లు, సీబీఐ, ఈడీ, ఐటీలు రాజకీయాలకు బలై, ఎలా కీలుబొమ్మలుగా మిగిలాయో మనం చూస్తూనే ఉన్నాం. సుప్రీం కోర్టు రెక్కలు కూడా విరగ్గొడుతున్నారు. ఆ ఒక్కటి కూడా పాలకుల నిర్ణయాలకు తానా అంటే తందాన అన్నప్పుడు నియంతృత్వం తుదిరూపం తీసుకున్నట్టు లెక్క.
మన స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు ఎన్నో కలలుగంటూ మనల్ని ఎక్కించిన రైలును ఇప్పుడు పాలకులు వెనక్కితిప్పారు. రైలు వేగంగా వెనక్కి వెళ్తున్నది. ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరు జపిస్తూనే పాలకులు దాని గొంతు పిసుకుతున్నారు. రాజ్యాంగం ఉండగానే, రాజ్యాంగం అనుమతించని పనులన్నిటినీ యధేచ్ఛగా చేస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రజలు అనుభవించే పరిస్థితి లేదు. తమ సమస్యల పరిష్కారానికి పౌరులకు నిరసన తెలియజేసే హక్కు లేదు. పత్రికలకు ప్రభుత్వ వ్యతిరేక గళాలని వినిపించే హక్కు లేదు. మేధావులూ, ఉద్యమకారులైతే జైల్లోకి వెళ్ళటానికి సిద్ధమవ్వాలి. నేరుగా మతోన్మాదాన్ని విమర్షించే మేధావులు ‘గుర్తు తెలియని’ వ్యక్తులచేత చంపబడతారు. ప్రగతిశీల శక్తుల దగ్గర మొదలు పెట్టి, ప్రత్యామ్నాయ (ప్రతిపక్ష ) రాజకీయ పార్టీలను కూడా అంతం చేసే బరితెగింపు స్థితికి దేశంలో ఒక వర్గం చేరుకుంది.
కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే, దేశం రానున్న కాలంలో సరిదిద్దుకోలేని వ్యవస్థాగత మార్పులకు లోనవుతుంది. వాళ్ళు బహిరంగంగానే ప్రకటిస్తున్నట్టు రేపు అధికారికంగానే ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చేస్తారు లేదా దాన్ని సమాధి చేసి, వారిదైన మరో రాజ్యాంగాన్ని అమలుచేస్తారు. ఫలితంగా దేశంలోని తొంబై శాతం ప్రజలు తాము ఇప్పటిదాకా అనుభవించిన హక్కులనూ, మనుషులందరూ ఒక్కటే అనే సమాన హోదానూ, అందరూ పైకి ఎదగటానికి గల కొన్ని అవకాశాలనూ సంపూర్ణంగా కోల్పోతారు. జవాబు దారీ తనంతో కూడిన పరిపాలననూ, మనుషులందరూ సమానమనే భావననూ, మత సామరస్యం, ప్రజలమధ్య సోదర భావంతో కూడిన మానవ సంబంధాలనూ, విజ్ఞానంతో కూడిన హేతుబద్ధతకు నిలబడే చర్చలనూ లేకుండా చేస్తే, ఇక మిగిలేవి మూఢనమ్మకాలు, మత విద్వేషం, కుల వివక్ష, లింగ వివక్ష, అసమానతలతో కూడిన విలువలే మిగులుతాయి. ఎప్పుడో చనిపోయిన ఈజిప్టు మమ్మీలు ఎన్నటికీ ప్రాణం పోసుకోకపోవచ్చు కానీ, కంప్యూటర్‌ యుగంలో కండ్లు తెరిచిన భారతీయ మనువు, తిరిగి తన సామాజిక వర్గ ఆధిపత్యాన్ని మరో వెయ్యేళ్ళు సుస్థిరం చేయటానికి సమాయత్తమవుతున్నాడు.
మోడీ అనే ఒక వ్యక్తిని ఎన్నో శక్తులు కలిగినవాడిగా, అన్ని నియమాలకూ అతీతమైన వ్యక్తిగా ఉదరగొడుతున్నారు. ఇదంతా నియంతృత్వ సమాజాల్లో జరిగే ప్రచార వ్యవహారం. ఇది ప్రజాస్వామ్య సంస్కృతి కానే కాదు. ఎన్నికల్లో గానీ, రాజకీయ చర్చల్లో గానీ ప్రజలకు చెప్పుకోవటానికి రాజకీయ పార్టీల దగ్గర సరుకు లేనప్పుడే ప్రజలతో మైండ్‌ గేమ్‌ ఆడతారు, సెంటిమెంట్లను రెచ్చగొడతారు. ప్రజల దైనందిన జీవిత విషయాలపై హేతుబద్ధమైన చర్చతో కాకుండా అభూత కల్పనలు, దారుణ వక్రీకరణలకు దిగుతూ అబద్ధాలను ప్రచారంలో పెడతారు. మతం పేరుతో ప్రజలను సమీకరించే వారికి, ఆ పని కొన్ని కులాల ప్రయోజనాల కోసమే చేస్తున్నామని తెలుసు. నేరుగా అది చెప్పలేక, అందరికీ సంభందించిన మతాన్ని ముందు పెడతారు. మతంలో గొప్ప ఏదీ లేనప్పుడు ఇతర మతాల పట్ల అకారణ ద్వేషాన్ని పెంచుతారు. మన దేవునికి అన్యాయం జరిగిందని అంటారు. మన మతం ప్రమాదంలో పడింది అంటారు. మన సంస్కృతికి అవమానం జరిగింది అంటారు. మనపూర్వీకులది అతి గొప్ప చరిత్ర అంటారు. ఈరోజు మన ఈ దుస్థితికి ఫలానా మతస్తులే కారణం అంటారు. ఇంకా, దేశభక్తి ప్రచారంతో వస్తారు. సంస్కృతి పునరుద్ధరణ పేరుతో వస్తారు. ఏదీ లేకపోతే తల్లిదండ్రుల పట్లా, కుటుంబ సంబంధాల పట్లా గౌరవం పెంచుతున్నట్టు లేదా వ్యక్తిత్వ వికాసం పెంపొందిస్తున్నట్టు కూడా వస్తారు. వాస్తవంగా సాధారణ ప్రజలకు ఇవి సెంటిమెంట్లే గానీ, ఇవేవీ తీవ్రమైన దైనందిన సమస్యలు కావు. వాటిలో కొన్ని నిజమైన సమస్యలున్నా వాటిని రాజ్యాంగ, చట్టబద్ధ పాలన పరిధిలో పరిష్కరించవచ్చు. దానికి ప్రజల దృష్టినంతా మరో మతస్తుల మీద కేంద్రీకరింప చేయాల్సిన పని లేదు.
‘మనం గత వైభవాన్ని’ కోల్పోయామనో, మన సంస్కృతికి పెను ప్రమాదం పొంచి ఉందనో ప్రజలు రోజూ వారి మానసిక ఒత్తిడిలో లేరు. లక్షలాదిగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకూ, నిరుద్యోగులకూ, ఇతర వర్గాల ప్రజలకూ ఇవేవీ దైనందిన సమస్యలు కానే కావు. నిత్య జీవిత ఆర్థిక, సామాజిక అంశాలే వారికి జీవన్మరణ సమస్యలు. కానీ నేడు రాజకీయం, సామాజికం, సకల మీడియా అంతా కలసి ప్రజలను తమ వర్తమాన, భౌతిక విషయాల మీద కాక ఇటువంటి నిరర్థకమైన విషయాల చుట్టూనే తిప్పుతున్నాయి. ప్రజల ఆర్థిక సమస్యలకు కారణమయ్యే అంతర్జాతీయ ఆర్థిక దోపిడీ దారులూ, దేశంలో సామాజిక దోపిడీ దారులూ కలిసిపోయి వేస్తున్న వేషాలే ఇవన్నీ. ఇలా, ఒక వైపు నియంతృత్వం అమలు చేస్తూ, మరోవైపు మానవ అసలు జీవితంలోని కష్టాలపై హేతుబద్ధ చర్చ లేకుండా ప్రజల దృష్టిని ఇతర విషయాలపైకి మరల్చటం అనేది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ దేశంలో జరిగింది, జర్మనీ దేశంలో జరిగింది. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది.
ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టే ఈ 2024 ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రజల సామాజిక, రాజకీయ చైతన్యానికిదొక పరీక్షా సమయం. ఈ కీలక మలుపు దగ్గర మనం ఒక నాయకుడిని మాత్రమే కాదు ఒక రాజకీయ విధానాన్ని ఎన్నుకోబోతున్నాం. ఎన్నికల్లో ఒకవైపు మతతత్వ నియంతృత్వ పరిపాలనా, మరోవైపు గాయపడి ఇంకా మిగిలిపోయిన ప్రజాస్వామ్యం, రాజ్యంగాలూ ఉన్నాయి. కాబట్టి, ప్రజలు ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక పార్టీలకు ఓటు వేయకుండా గట్టి నిర్ణయం తీసుకోగలగాలి. ఓటు మాత్రమే కాదు, నిరంతర చైతన్యం, ధిక్కారాల ద్వారా మాత్రమే పౌరులు ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యాంగాన్నీ కాపాడుకోగలరు, మరింత ప్రజాపక్షం చేసుకోగలరు.
డా. ఎస్‌ తిరుపతయ్య 9849228212