పాలక పక్షానికి కష్టం..

It is difficult for the ruling party..– ప్రతిపక్షాలకు మంచి ఫలితాలు…
– తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకల సందర్భంగా పంచాంగకర్తలు
– మకర రాశి వారు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
క్రోధి నామ సంవత్సరంలో పాలక పక్షానికి కష్టాలు ప్రారంభంకానున్నాయని పంచాంగకర్తలు తెలిపారు. కొంచెం కష్టపడితే ప్రతిపక్షాలకు మంచి ఫలితాలు వస్తాయని వారు చెప్పారు. ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ ఇంఛార్జి మన్నె గోవర్థన్‌ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సీనియర్‌ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాగకర్త ఫణీంద్ర కుమార్‌…క్రోధి నామ సంవత్సరంలో మంచి, చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనీ, పాడిపంటలకు ఇబ్బంది ఉండబోదని వివరించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌ జాతకాలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. కేసీఆర్‌ది కర్కాటక రాశి అనీ, ఆయన ఏం చేసినా విజయం సిద్ధిస్తుందని చెప్పారు. ఆయన చేపట్టబోయే చర్యలకు, వేసే ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుందని తెలిపారు. కేటీఆర్‌ది మకర రాశి అని పేర్కొన్నారు. ఈ రాశి వారు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదనీ, ఆచితూచి మాట్లాడితే బావుంటుందని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన ఆదాయ, వ్యయాలు సమానంగా ఉన్నాయని వివరించారు.
అందరికీ మంచి జరగాలి : కేటీఆర్‌
అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ… కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రజలంతా శాంతి, సౌభాగ్యం, మతసామరస్యంతోమ మెలగాలని అన్నారు. సకాలంలో వర్షాలు పడి పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.