కక్ష్య నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఇలా..

కక్ష్య నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఇలా..న్యూయార్క్‌: సంపూర్ణ సూర్యగ్రహణం భూమిపై నుంచి వీక్షించడానికి జనం ఆసక్తి చూపారు. మరోవైపు గ్రహణాన్ని ఛేజ్‌ చేయడానికి నాసా ఏర్పాట్లు కూడా చేసింది. అసలు అంతరిక్షం నుంచి భూమిపై గ్రహణం ఎలా కనిపిస్తుందో తెలుసా..? ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌ ఉపగ్రహం ఒకటి ఆ అరుదైన దృశ్యాలను రికార్డు చేసింది. భూమికి చుక్క పెట్టినట్టు చంద్రుడి నీడ స్పష్టంగా కనిపిస్తోంది. గ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎలాన్‌ మస్క్‌, స్టార్‌లింక్‌ ఖాతాల్లో ఈ క్లిప్‌ను పోస్టు చేశారు.ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చిత్రీకరించారు. దక్షిణ కెనడాపై 260 మైళ్ల ఎత్తులో ఈ కేంద్రం ప్రయాణిస్తుండగా భూమిపై చంద్రుడి నీడ కదులుతూ స్పష్టంగా కనిపిస్తోంది. అది ఏ ప్రాంతానికి చేరితే అక్కడ చీకట్లు అలముకుంటున్నట్లుంది. ఈ విషయాన్ని ఐఎస్‌ఎస్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది.ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. గ్రహణంలో సంపూర్ణ దశ.. గరిష్టంగా 4 నిమిషాల 28 సెకన్ల పాటు కొనసాగింది. ఆ సమయంలో చందమామ.. సూర్యుడిని పూర్తిగా కప్పేసింది. ఫలితంగా పట్టపగలే భూమిపై చీకట్లు ఆవరించాయి. గ్రహణం తొలుత మెక్సికోలో దర్శనమిచ్చింది. గత కొన్నేళ్లలో ఈ ప్రాంతంలో కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణాల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైంది.