ఉక్రెయిన్ – రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని, అది భవిష్యత్తులో ఎలాంటి చర్చలకు ఆధారం కాజాలదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నాడు. ఏదైనా చర్చలు రష్యా భద్రతా సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని బీజింగ్, మాస్కో అంగీకరించాయని మంగళవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, లావ్‌రోవ్ లు ప్రకటించారు. 2022 శరదతువులో జెలెన్‌స్కీ ప్రతిపాదించిన పది-పాయింట్ల శాంతి ప్రతిపాదన 1991లో అస్తిత్వంలో ఉన్న ఉక్రెయిన్ సరిహద్దులలోని అన్ని భూభాగాల నుంచి రష్యన్ దళాలను పూర్తిగా, బేషరతుగా ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చింది. అలాగే రష్యా మిలిటరీ కమాండర్లను, రాజకీయ నాయకత్వాన్ని విచారించడం కోసం ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, ఉక్రెయిన్‌కు నష్టపరిహారం కూడా చెల్లించాలని ఈ ప్రణాళికలో ఉంది.
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే ఉక్రెయిన్, దాని పాశ్చాత్య మద్దతుదారులు ”క్షేత్ర స్థాయిలో వాస్తవికతను” అంగీకరించినప్పుడు మాత్రమే శాంతి చర్చలు జరుగుతాయని రష్యా ప్రకటించింది. ”భద్రతా రంగంలో అన్నింటి కంటే ఎక్కువగా పాల్గొన్న అన్ని పార్టీల చట్టబద్ధమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం” గురించి చైనా, రష్యా ఒకే అభిప్రాయంతో ఉన్నాయని మంగళవారంనాడు బీజింగ్‌లో వాంగ్‌తో జరిపిన చర్చల అనంతరం లావ్‌రోవ్ వెల్లడించారు.
జెలెన్‌స్కీ శాంతి ప్రతిపాదనను ”వాస్తవికత నుంచి వేరుపడినది”, ”ఏమాత్రం పసలేనిది” అని లావ్రోవ్ అభివర్ణించాడు.
చైనా తీసుకున్న సమతుల్య వైఖరికి, ఉక్రెయిన్ వివాదాన్ని ముగించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నందుకు లావ్‌రోవ్ ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 2023లో చైనా ప్రతిపాదించిన 12-పాయింట్ల శాంతి చొరవను స్పష్టమైనదిగాను, ఇప్పటివరకు అత్యంత ఆచరణీయమైనదిగాను ఉందని గత వారం లావ్రోవ్ ప్రశంసించాడు. అది ”ప్రస్తుత సంఘటనలకుగల మూల కారణాల విశ్లేషణ ఆధారంగా చేసిన ప్రతిపాదన.” ఉక్రెయిన్‌లో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, శాంతి చర్చలను పునఃప్రారంభించాలని, ”ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని” విడిచిపెట్టాలని, అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని చైనా ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక పిలుపునిచ్చింది.
”ఉక్రెయిన్‌లో రష్యా ప్రత్యేక సైనిక ఆపరేషన్ ప్రారంభించిన తరువాత భౌగోళిక, రాజకీయ వాస్తవికత నాటకీయంగా మారిపోయిందని, ఉక్రెయిన్, రష్యన్ ఫెడరేషన్‌ల మధ్య సరిహద్దులు మారాయని, 2022 చివరలో డోనెట్‌స్క్, లుగాన్‌స్క్, ఖెర్సన్, జాపోరోజియే ప్రాంతాలలో మాస్కో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలలో స్థానిక నివాసితులలో అత్యధికులు రష్యాలో చేరడానికి అనుకూలంగా ఓటు వేశారన్న వాస్తవాన్ని ఉక్రెయిన్ అంగీకరించాలి” అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మార్చిలో ఆర్‌ఐఏ నోవోస్టి వార్తాసంస్థతో మాట్లడుతూ తెలిపారు.