సాయన్న కుటుంబానికే బీఆర్‌ఎస్‌ కంటోన్మెంట్‌ టికెట్‌

– బీఆర్‌ఎస్‌ కంటోన్మెంట్‌ అభ్యర్థిగా నివేదిత
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నిక బీఆర్‌ఎస్‌ టికెట్‌ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే వరించింది. సాయన్న రెండో కుమార్తె నివేదిత పేరును మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రకటించారు. నివేదిత సోదరి, సాయన్న మూడో కుమార్తె లాస్య నందిత గత అసెంబ్లీ ఎన్ని కల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రెండు నెలలకే రోడ్డు ప్రమాదంలో మతి చెందిన సంగతి తెలిసిందే. దాంతో మే 31న కంటోన్మెంట్‌ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీఆర్‌ఎస్‌ నుంచి పలువురు ఆశావాహులు టికెట్‌ ఆశించినా కేసీఆర్‌ మాత్రం సాయన్న బిడ్డ నివేదితను అభ్యర్థిగా ప్రకటించారు. నివేదిత రాజకీయంగా అపార అనుభవం ఉన్న మహిళ. ఎమ్మెల్యే సాయన్న ఉన్న రోజుల్లో నివేదిత చేదోలు వాదోడుగా ఉండి అప్పట్లో ఆయనకు సహకారాలు అందిస్తూ ఉండేది. సాయన్న మరణం తర్వాత పార్టీ అధిష్టానం నివేదితకే టికెట్‌ ఇవ్వాలని చూసింది. అయితే తన సోదరి లాస్య నందితకే అవకాశం ఇవ్వాలని నివేదిత కోరడంతో నందితకే టికెట్‌ పార్టీ కేటాయించింది. అనుకోని పరిస్థితుల్లో గెలిచిన రెండు నెలలకే ఆమె మతి చెందడంతో ఇప్పుడు కంటోన్మెంట్‌కు మళ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది. నివేదిత దివంగత ఎమ్మెల్యే జి. సాయన్న, గీత దంపతుల రెండో కుమార్తె 24 నవంబర్‌ 1984న హైదరాబాద్‌ లో ఆమె జన్మించారు . సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్‌లో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. ఎస్‌ఆర్‌ నగర్‌లోని గౌతమి జూనియర్‌ కాలేజీ నుంచి ఇంటర్‌ పూర్తి చేశారు. అనంతరం జేఎన్టీయూ పరిధిలోని భోజిరెడ్డి మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు.నివేదితకు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంది. ముఖ్యంగా సాయన్న ఎక్కడికి వెళ్లినా నివేదిత వెంట కనిపించేవారు. అలా బీఆర్‌ఎస్‌ శ్రేణులందరితోనూ ఆమెకు మంచి పరిచయా లున్నాయి. అందరినీ అన్నా అంటూ ఆప్యా యంగా పిలుస్తూ గులాబీశ్రేణులందరితోనూ కలుపు గోలుగా ఉంటారు నివేదిత. నివేదిత దివంగత సాయన్న చివరిరోజుల్లో ఆయన వెంటే ఉండి, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే తన సోదరి లాస్యనందితను గెలిపించుకోవడం లోనూ నివేదిత ముఖ్యపాత్ర పోషించారు. లాస్యనందితకు కీలకమైన సూచనలు, సలహాలు చేస్తూ పెద్దదిక్కుగా నిలిచారు.