రాత్రి కాపలాదారులుగా ఉపాధ్యాయులు…

As night watchmen Teachers...– విద్యార్థులను పూర్తిగా పర్యవేక్షించాలి వంతుల వారీగా నైట్‌డ్యూటీల కేటాయింపు
– టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ ఉత్తర్వులు
– ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)లో ఉపాధ్యాయులకు రాత్రి బస విధులు (నైట్‌ స్టే డ్యూటీ) కేటాయించింది. అంటే వారు రాత్రిపూట విద్యార్థులకు కాపలాదారులుగా పనిచేయాల్సి ఉంటుంది. రాత్రంతా విద్యార్థుల కదలికలను పూర్తిగా పర్యవేక్షించాలి. రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు రాత్రి బస విధులను కేటాయించారు. ఆయా విధులు నిర్వర్తించే ఉపాధ్యాయుల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచారు. ఒకవేళ సరిపోయినంత మంది రెగ్యులర్‌ ఉపాధ్యాయులు అందుబాటులో లేకుంటే పార్ట్‌టైం సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి. సెలవు దినాల్లోనూ రాత్రిపూట విద్యార్థులను పర్యవేక్షించాలి. ఉపాధ్యాయుల రాత్రి విధుల కేటాయింపులను సంబంధించిన ప్రక్రియను సంబంధిత విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలి. ఇందుకోసం ప్రిన్సిపాల్‌ తప్పనిసరిగా ఆ విద్యాసంస్థలోనే బస చేయాలి. అక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలలంటూ టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి కె సీతాలక్ష్మి బుధవారం ఉత్తర్వులను విడుదల చేశారు. జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా కోఆర్డినేటర్లతో ప్రిన్సిపాళ్లు ఈ అంశంపై సంప్రదించాలని ఉత్తర్వుల్లో సూచించారు. క్లిష్టమైన సమయంలో జిల్ల శిశు సంరక్షణ అధికారి సేవలను వినియోగించుకోవాలనీ, విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించాలని సూచించారు. రీజినల్‌ కోఆర్డినేటర్లు వారి పరిధిలోని విద్యాసంస్థలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రాత్రి కాపలాదారుల
స్థాయికి దిగజార్చకండి : టీఎస్‌యూటీఎఫ్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయులకు నైట్‌డ్యూటీలు వేయడం కాదనీ, పిల్లలపై మానసిక ఒత్తిడి తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో అప్రమత్తమైన టీఎస్‌డబ్ల్యూఆర్‌ ఈఐఎస్‌ కార్యదర్శి సీతా లక్ష్మి రాత్రి విధుల ఉపాధ్యాయుల సంఖ్యను రెండు నుండి నాలుగుకు పెంచుతూ ఉత్తర్వులిచ్చారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల ఉపాధ్యాయుల విభాగం అధ్యక్షులు డి ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి శశిధర్‌, కోశాధికారి ఎండీ అనిసా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు వంతుల వారీగా రాత్రి కాపలా కాయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొనటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. గురుకుల ఉపాధ్యాయులను రాత్రి కాపలాదారు స్థాయికి దిగజార్చడం తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు వారిపై పెరిగిన మానసిక ఒత్తిడి కారణమని తెలిపారు. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వింతైన ఉత్తర్వులివ్వటం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇంటర్‌, పదో తరగతిలో ఉత్తమ ఫలితాల పేరుతో విద్యార్థులను కార్పొరేట్‌ విద్యాసంస్థల తరహాలో ఒత్తిడికి గురిచేస్తూ మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఆ కారణంగానే కార్పొరేట్‌ విద్యాసంస్థలకు పరిమితమైన విద్యార్థుల ఆత్మహత్యలు గురుకుల విద్యాసంస్థల్లోనూ జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక పాఠశాలలను అద్దె భవనాల్లో నిర్వహిస్తూ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. మెస్‌ చార్జీలు పెంచుతామంటూ చెప్పి రెండేండ్లు గడిచినా జీవో ఇవ్వలేదని గుర్తు చేశారు. ఎండలను తట్టుకోవడానికి విద్యార్థులకు పుచ్చకాయలు, చల్లని మజ్జిగ, చల్లని నీరు అందుబాటులో ఉండాలంటూ ఆదేశించారనీ, అదనపు బడ్జెట్‌ ఇవ్వకుండా ఇవన్నీ ఎలా సాధ్యమో అధికారులే చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులపై ఇప్పటికే బోధనేతర పనుల భారం అధికంగా ఉందనీ, ఇప్పుడు రాత్రి విధుల్లో వారి సంఖ్యను పెంచడం ద్వారా వారిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను నైట్‌ వాచ్‌మన్లుగా మార్చొద్దని కోరారు. విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.