ప్రాణాంతకంగా హెపటైటిస్‌

Fatal hepatitis– బీ, సీ వైరస్‌లతో సంభవిస్తున్న మరణాలు
– అతి తక్కువ మందికే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స
– రక్షణ కవచంగా పనిచేస్తున్న వ్యాక్సిన్‌
న్యూఢిల్లీ : మన దేశంలో హెపటైటిస్‌ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2022లో ఈ వైరల్‌ కేసుల సంఖ్య మూడున్నర కోట్లకు చేరింది. ఆ సంవత్సరం ప్రపంచంలో హెపటైటిస్‌ బారిన పడిన వారిలో 11.6% మంది భారత్‌కు చెందిన వారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన అంతర్జాతీయ హెపటైటిస్‌ నివేదిక తెలిపింది. దీనిని మంగళవారం విడుదల చేశారు. కాలేయంలో వాపు కారణంగా హెపటైటిస్‌ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ఓ అంటువ్యాధి. వివిధ రకాల వైరస్‌ల కారణంగా హెపటైటిస్‌ సోకుతుంది. దీనిని సకాలంలో కనిపెట్టి చికిత్స అందించకపోతే కాలేయ వ్యాధి, సిర్రోసిస్‌ వ్యాధి, కాలేయ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. మరణానికి దారితీసే వ్యాధులలో ఇది కూడా ఒకటి. ఏటా ప్రపంచంలో 13 లక్షల మంది దీని బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. టీబీ వ్యాధి ఎంత ప్రాణాంతకమో ఇది కూడా అంతే.
ఆ రెండు వైరస్‌లే ప్రమాదం
హెపటైటిస్‌ వ్యాధి ఐదు రకాల వైరస్‌ల (ఏ, బీ, సీ, డీ, ఈ) కారణంగా వస్తుంది. వీటిలో బీ, సీ వైరస్‌ల బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. మొత్తం మరణాలలో 96% ఈ రెండు వైరస్‌ల కారణంగానే సంభవిస్తున్నాయి. చైనా తర్వాత హెపటైటిస్‌ రోగుల సంఖ్య మన దేశంలోనే అధికంగా ఉంది. 2022లో మన దేశంలో 2.98 కోట్ల హెపటైటిస్‌-బీ కేసులు, 55 లక్షల హెపటైటిస్‌-సీ కేసులు నమోదయ్యాయి.
187 దేశాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం వైరల్‌ హెపటైటిస్‌ కారణంగా 2019లో 11 లక్షల మంది చనిపోగా 2022లో 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 83 శాతం మరణాలకు హెపటైటిస్‌-బీ కారణం కాగా 17 శాతం మరణాలకు హెపటైటిస్‌-సీ కారణమైంది. ప్రపంచంలో ప్రతి రోజూ 3,500 మంది హెపటైటిస్‌ బీ, సీ ఇన్‌ఫెక్షన్ల కారణంగా చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆ సంస్థ అందించిన తాజా అంచనాల ప్రకారం 2022లో ప్రపంచంలో 25.4 కోట్ల మంది హెపటైటిస్‌-బీ, ఐదు కోట్ల మంది హెపటైటిస్‌-సీ బారిన పడ్డారు. ప్రాణాంతక హెపటైటిస్‌ బీ, సీ వైరస్‌లు సోకిన వారిలో సగం మంది 30-54 సంవత్సరాల మధ్య వయస్కులే. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో 12 శాతం మందికి ఈ వైరస్‌లు సోకుతున్నాయి. మొత్తం కేసుల్లో పురుషుల వాటాయే (58 శాతం) అధికంగా ఉంటోంది. డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం 2022లో మన దేశంలో హెపటైటిస్‌-బీ కారణంగా 98,305 మంది, హెపటైటిస్‌-సీ కారణంగా 26.206 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళన కలిగించే విషయమేమంటే ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారిలో కేవలం 2.4% మందికి మాత్రమే వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిగాయి.
ఆ దేశాలలోనే అధికం
హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్లను నిరోధించడంలో పురోగతి సాధిస్తున్నప్పటికీ చాలా కొద్ది మందిలో మాత్రమే వ్యాధి నిర్ధారణ, చికిత్స జరుగుతోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రాస్‌ అడ్హనమ్‌ గేబ్రియేసస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్‌ బీ, సీ బారినపడిన వారిలో బంగ్లాదేశ్‌, చైనా, ఇథియోపియా, భారత్‌, నైజీరియా, పాకిస్తాన్‌, ది ఫిలిప్పీన్స్‌, ది రష్యన్‌ ఫెడరేషన్‌, వియత్నాం దేశాలలో కలిపి మూడింట రెండు వంతుల మంది ఉన్నారని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక చెబుతోంది.
వ్యాప్తికి కారణాలివే
ఇంజక్షన్లు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, కలుషితమైన సిరంజీలు, నీడిల్స్‌ వాడడం వల్ల హెపటైటిస్‌ బీ, సీ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఇన్‌ఫెక్షన్‌తో నిండిన రక్తాన్ని, దానికి సంబంధించిన ఉత్పత్తులను వినియోగించడం, లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన తల్లి నుంచి బిడ్డకు కూడా వ్యాధి వ్యాపిస్తుంది.
వ్యాక్సిన్‌తో చెక్‌
మన దేశంలో హెపటైటిస్‌-బీ సోకిన వారిలో 40-50 శాతం మంది ఓ రకమైన లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మరో 20-30 శాతం మంది సిర్రోసిస్‌ వ్యాధికి గురవుతున్నారు. హెపటైటిస్‌-బీని అడ్డుకునేందుకు 2002-03లో వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టారు. 2010 నాటికి దేశవ్యాప్తంగా ఇది వినియోగంలోకి వచ్చింది. వ్యాధి నుంచి పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ వ్యాక్సిన్‌ ఎంతగానో ఉపకరిస్తోంది. హెపటైటిస్‌-బీ వ్యాక్సిన్‌ను శిశువు పుట్టగానే వేస్తారు. ఆ తర్వాత 6, 10, 14 వారాల వయసప్పుడు డోసులు ఇస్తారు. 2015లో దేశంలోని చిన్నారుల్లో 86 శాతం మందికి మూడో డోసు వ్యాక్సిన్‌ అందింది. అయితే పుట్టిన వెంటనే వేసే డోసు మాత్రం 45 శాతం మంది శిశువులకు మాత్రమే లభించింది.