భారత యూనికర్న్‌లలో స్తబ్దత

భారత యూనికర్న్‌లలో స్తబ్దత– గతేడాది పోల్చితే తగ్గుదల
– ప్రపంచంలో కొత్తగా 171 ఆవిర్బావం
– అమెరికా, చైనా నుంచి భారీగా చేరిక
– హురున్‌ రీసెర్చ్‌ ఇన్స్‌ట్యూట్‌ రిపోర్ట్‌
న్యూఢిల్లీ : భారత స్టార్టప్‌లు వెనుకబడి పోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని బిజెపి వర్గాలు చేస్తోన్న ప్రచారానికి స్టార్టప్‌ల పెరుగుదల భిన్నంగా ఉంది. 2023లో భారత్‌లో యూనికార్న్‌లు పెరగాల్సింది పోయీ.. పైగా ఒక్కటి తగ్గింది. భారత్‌లో 2022లో మొత్తం 68 యూనికార్న్‌లుండేవని.. గతేడాది ఈ సంఖ్యలో ఒక్కటి తగ్గి 67గా నమోదయ్యిందని హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ 2024 నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక విలువ కోల్పోయిన వాటిలో భారత్‌కు చెందిన బైజూస్‌ టాప్‌లో ఉంది. అయితే.. ప్రపంచ దేశాల్లో మాత్రం భారత్‌ ర్యాంక్‌ యథాతథంగా మూడో స్థానంలోనే ఉందని పేర్కొంది. బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8300 కోట్లు) పైగా విలువ చేసే స్టార్టప్‌లను యూనికర్న్‌లుగా గుర్తిస్తారు.
హురున్‌ రిపోర్ట్‌ ప్రకారం.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 171 స్టార్టప్‌లు యూనికార్న్‌ హోదాను పొందాయి. ఏడాదిలో రెండు రోజులకు ఒక కొత్త యూనికార్న్‌లుగా మారాయి. ఈ ఏడాది జనవరి 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 1,453 యూనికార్న్‌లున్నాయి. 2022తో పోలిస్తే 7 శాతం పెరిగాయి. కొత్తగా అమెరికాలో 70, చైనాలో 56 సంస్థలు యూనికార్న్‌ స్థాయికి చేరాయి. దాంతో పాటు యుఎస్‌లో 21, చైనాలో 11 కంపెనీలు ఈ హోదా నుంచి తప్పుకున్నాయి. ఇతర దేశాల నుంచి 45 కొత్త అంకురాలు యూనికార్న్‌లుగా నమోదయ్యాయి.
కంపెనీల విలువ ఆధారంగా హురున్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన జాబితాలో బైట్‌ డ్యాన్స్‌ (180 బిలియన్‌ డాలర్లు), స్పేస్‌ ఎక్స్‌ (100 బిలియన్లు), ఓపెన్‌ఎఐ, యాంట్‌ గ్రూప్‌, షీన్‌ తదితర అగ్రస్థానంలో ఉన్నాయి. టాప్‌ 10లో ఒక్క భారత కంపెనీ కూడా లేకపోవడం గమనార్హం. అమెరికా ప్రపంచంలోనే మొత్తం 703 యూనికార్న్‌లతో అగ్రస్థానంలో ఉంది. చైనా 340 యూనికార్న్‌లతో రెండో స్థానంలో, 53 యూనికార్న్‌లతో బ్రిటన్‌ నాలుగో స్థానంలో నిలిచాయి. బైజూస్‌ 2022లో దాదాపు రూ.1.80 లక్షల కోట్ల విలువను కలిగి ఉండగా.. గతేడాది జాబితాలోనే లేకుండా పోవడం గమనార్హం.
ప్రోత్సాహం తగ్గింది..
భారత్‌లో స్టార్టప్‌ రంగానికి ప్రోత్సాహం తగ్గిందని హురున్‌ ఇండియా వ్యవస్థాపకులు అనాస్‌ రెహ్మన్‌ జునైద్‌ అన్నారు. వెంచర్‌ క్యాపిటల్ట్‌లు భారీ పెట్టుబడులు పెట్టడం లేదని వెల్లడించారు.