నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మూడోసారి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం పార్లమెంట్‌లోని ప్రత్యేక ఛాంబర్‌లో రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌ఖర్ నూతన, తిరిగి ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయన్, రాజ్యసభ సెక్రెటరీ జనరల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ సభ్యురాలిగా రేణకా చౌదరి ప్రమాణం చేశారు. ఆమెతో పాటు గుజరాత్ నుంచి మయాంక్ భారు జవదేవ్ భాయి(బీజేపీ), కర్ణాటక నుంచి నారాయణ కష్ణాసా భాండగే(బీజేపీ), మహారాష్ట్ర నుంచి మిలిన్ద్ మురళీ దేవ్ రా (శివసేన), అజిత్ మాధవ్ రావు గోప్ చడే (బీజేపీి), ఉత్తరప్రదేశ్ నుంచి అమర్ పాల్ మౌర్య(బీజేపీ), సంజరు సేట్(బీజేపీ), రాం జీ లాల్ సుమన్ (ఎస్‌పీి), పశ్చిమ బెంగాల్ నుంచి సాగరిక ఘోజ్(టీఎంసీ), మమతా ఠాకూర్(టీఎంసీ) ప్రమాణం చేశారు. ఇటీవల తెలంగాణలోని పలు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగగా… రాష్ట్ర అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రల అభ్యర్థిత్వాలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటికే వద్ది రాజు రవిచంద్ర, అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.