– ఇంకా వీడని కాంగ్రెస్ ఖమ్మం టిక్కెట్ పీటముడి
– స్థానికేతరులకు టిక్కెట్ వార్తలతో పార్టీపై శ్రేణుల ఒత్తిడి
– ముగ్గురు మంత్రులతోనూ సాన్నిహిత్యం..
– వివాదరహితుడన్న పేరు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో జాప్యంతో సునాయాసంగా నెగ్గే స్థానాన్ని ఆ పార్టీ జఠిలం చేసుకుంటుందనే టాక్ నడుస్తోంది. మరో వారం రోజుల్లో నామినేషన్ల ఘట్టం మొదలు కానుంది. గట్టిగా ప్రచారం చేసినా పట్టుమని నెలరోజుల సమయం కూడా లేదు. స్థానికేతరుడు, జిల్లా ప్రజలకు పెద్దగా పరిచయం లేని కొత్త అభ్యర్థి అయితే ప్రత్యర్థులు పుంజుకునే అవకాశం ఉన్న దృష్ట్యా పార్లమెంట్ పరిధిలోని వ్యక్తికే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ శ్రేణుల నుంచి అధిష్టానంపై ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో రాయల నాగేశ్వరరావు పేరు ట్రోల్ అవుతోంది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా దరఖాస్తులను పార్టీ ఆహ్వానించింది. ఖమ్మం నుంచి రాయల నాగేశ్వరరావు కూడా దరఖాస్తు చేశారు. దాదాపు 15-20 ఏండ్లుగా పార్టీకి విధేయుడిగా ఉంటున్నాడన్న పేరు ఉండటంతో ఆయనను ఎందుకు పరిశీలించకూడదనే యోచన పార్టీ నాయకత్వం వైపు నుంచి వస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే చర్చ..!
టీపీసీసీ బాధ్యతల్లో ఉన్న రాయల నాగేశ్వరరావుతో ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారని సన్నిహితుల ద్వారా సమాచారం. టికెట్లపై చర్చల ప్రారంభంలోనే ఏ మేరకు డబ్బులు పెట్టగలరు? ఆర్థిక స్థితిగతులపై చర్చించినట్టు చెబుతున్నారు. అయితే అప్పట్లో ముగ్గురు మంత్రుల కుటుంబీకులు ఆశావహులుగా ఉన్నారు. ఇప్పటికే వారిలో ఒకరిద్దరికి స్పష్టతనిచ్చినా ఇంకా ఒక్కర్ని కాదనలేని పరిస్థితి ఉంది. తమ కుటుంబీకులకు టిక్కెట్ రాదనుకుని నిర్ధారణకు వచ్చిన ఇద్దరు మంత్రులు వేర్వేరు పేర్లను అధిష్టానం ముందు ఉంచుతున్నారు. బయటి నుంచి మరో అభ్యర్థిని తీసుకొస్తే కొత్త సమస్యలు వచ్చే ఆస్కారం ఉందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలోని నాయకుల్లో ముగ్గురు మంత్రులతోనూ అన్యోన్యత ఉన్న నేతను ఎంపిక చేయాల్సి వస్తే బెటర్ ఆప్షన్‌గా రాయల పేరు ఆ పార్టీలో కొందరి నుంచి వినిపిస్తోంది. ఒకవేళ మంత్రుల కుటుంబ సభ్యులకు ఇవ్వకపోతే రాయలకే ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు.
ముగ్గురు మంత్రులతోనూ సాన్నిహిత్యం
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో రాయల నాగేశ్వరరావుకు సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీకి విధేయుడు, వివాదరహితుడు కావడం ఆయనకు ప్లస్ పాయింట్ అని తెలుస్తోంది. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బలం లేకపోయినప్పటికీ బరిలో నిలిచి గట్టిపోటీ ఇచ్చారు. మంత్రులు తుమ్మల, పొంగులేటి లాంటి బలమైన నేతల కోసం ఆయన టిక్కెట్ త్యాగం చేసిన సందర్భాలున్నాయి. మరో మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేయడంలో రాయల తోడ్పాటు ఉందనే ప్రచారం కూడా ఉంది. సామాజిక కోణంలో ఓ మీడియా అధినేత వైపు నుంచి కూడా ఖమ్మం సీటు విషయంలో ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి హామీ మేరకు నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌గానూ రాయలకు పదవి ఇప్పించారు. మంత్రుల కుటుంబీకులకు కాని పక్షంలో రాయల పేరు ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇప్పటికీ చాలా పేర్లు వచ్చినా చివరికి ఎవరిని ఖరారు చేసేది కాంగ్రెస్ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.