– ముస్లింలకు సీఎం,గవర్నర్ రంజాన్ శుభాకాంక్షలు
– మత సామరస్యానికి ప్రతీక రంజాన్ : సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను ముస్లిం సోదరులు గురువారం జరుపుకోనున్నారు. నెలరోజులపాటు ఉపవాసదీక్షలు బుధవారంతో ముగిశాయి. గురువారం పండుగ సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లౌకిక వాదానికి, మత సామరస్యానికి రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ప్రతీక అని పేర్కొన్నారు. . పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైందనే విషయాన్ని రంజాన్ చాటి చెప్పిందని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని సీఎం ఈ సందర్భంగా వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే పాత బస్తీలో మెట్రో లైన్‌కు శంకుస్థాపన చేయటంతో పాటు మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులను పెంచామని గుర్తు చేశారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా అశీర్వాదాలుండాలని సీఎం ప్రార్ధించారు.
ప్రజల శ్రేయస్సు, శాంతిని కోరుకుంటోంది..గవర్నర్
ముస్లింలకు రాష్ట్ర గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఒక ప్రకటన విడుదల చేసింది. పవిత్ర ఖురాన్ బోధనలు, సమాజంపై ప్రగాఢమైన ప్రభావం చూపాయని పేర్కొన్నారు. రంజాన్ పండుగ ప్రజల శ్రేయస్సు, శాంతిని కోరుకుంటుందని తెలిపారు. స్వీయ క్రమశిక్షణ, నిబద్ధత, పవిత్రతను పాటిస్తూ ముస్లింలు జరుపుకునే ఈ పండుగ వారి కుటుంబాల్లో సుఖ శాంతులను నింపాలని ఆకాంక్షించారు.
ముస్లీంలకు కేసీఆర్ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదినం సందర్భంగా ముస్లీం సోదరులకు బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు, తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావారణాన్ని నింపాయన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, నూతన రాష్ట్రాన్ని సర్వమతాల సమాహారంగా, గంగా జమునా తహజీబ్‌కు ఆలవాలంగా నెలకొల్పామని తెలిపారు. తమ పదేండ్ల పాలనలో లౌకికవాద సాంప్రదాయాలను పాటిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టామని కేసీఆర్ తెలిపారు. అదే సాంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు.