నేటి వరకు  36,596  మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు  

– 12.66 కోట్లు రైతు ఖాతాలో జమ
 – కలెక్టర్ హరిచందన  దాసరి
 నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
యాసంగి ధాన్యం కొనుగోలులో భాగంగా నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 36,596 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, రైతుల ఖాతాలలో 12 కోట్ల 66 లక్షల రూపాయల జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి  370 కొనుగోలు కేంద్రాలను తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేవని అని కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించామని  చెప్పారు. ధాన్యం సేకరణ, తాగునీటి సరఫరా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, వడదెబ్బ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా అధికారులతో బుధవారం   వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు.
    ధాన్యం కొనుగోలు సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు రైతుల నుండి యసంగి  ధాన్యం కొనుగోలు చేస్తూ  రైతుల ఖాతాలోకి  డబ్బులు సైతం జమ చేస్తున్నామని, వానాకాలం సీఎంఆర్ డెలివరీ ని సైతం పూర్తి చేస్తామని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి ధాన్యం కొనుగోలు ,తాగునీటి ఎద్దడి నివారణ, వడదెబ్బలపై పలు సూచనలను చేశారు. పాఠశాలల ప్రారంభం నాటికి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన పనులన్నిటిని పూర్తిచేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం  ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలన్నారు. వడదెబ్బ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రజలు వడదెబ్బకు గురికాకుండా వడదెబ్బపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో  రెవెన్యూ  అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్రరావు,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.