న్యూఢిల్లీ బ్యూరో :ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గిరిజన ప్రజలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ త్రిపుర లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న తొలిదశలో, తూర్పు త్రిపుర స్థానానికి ఏప్రిల్ 26న రెండవ దశలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రచారం హౌరెత్తుతోంది. సిపిఎం సారధ్యంలోని ఇండియా ఫోరం, బిజెపి నేతత్వంలోని ఎన్‌డిఎ పోటీ చేస్తున్నాయి. ఇక్కడ ద్విముఖ పోటీ ఉంది. నెగ్గడం కోసం అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి.
‘రాచరికం’ వైపు బీజేపీ
ఎస్‌టి రిజర్వుడ్ సీటు తూర్పు త్రిపురలో రాజకుటుంబానికి చెందిన వారసురాలు కీర్తి సింగ్ దేవ్ వర్మను బిజెపి పోటీలోకి దింపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో నివసిస్తున్నారు. అక్కడ ఆమె మరొక రాజకుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. బిజెపి నిర్ణయం గిరిజన ప్రయోజనాలకు ద్రోహమని, రాజవంశ రాజకీయాలకు అవకాశం ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి బిజెపి చర్యను గిరిజన హక్కులను ”అమ్మేసుకోవడం” అని ఖండించారు. బిజెపి-తిప్ర మోత పొత్తు అపవిత్రమైనదని, అవకాశవాదమని కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రారు బర్మాన్ రాష్ట్రానికి కీర్తి సింగ్ నిబద్ధతపై సందేహాలను పేర్కొంటూ ఎన్డిఎ కూటమిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
హింసే సమస్య
రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన అంశంగా ఉంది. ధరలు పెరుగుదల వంటి అనేక సమస్యలను సిపిఎం, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ నియామకాల్లో వైఫల్యాలను లేవనెత్తుతున్నారు. అలాగే రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లుతున్నాయి. రాజకీయ హింస, దౌర్జన్యాలు పెరిగాయి. సిపిఎం, వామపక్ష కార్యకర్తలపై దాడులు, హత్యలు, సిపిఎం, ప్రజా సంఘాల కార్యాలయాలపై దాడులు వంటివి నిత్యం జరుగుతున్నాయి. ప్రతిపక్షాలను బలహీనం చేసేందుకు బిజెపి అనేక రాకాల దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను సజావుగా స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వామపక్ష కూటమి విజ్ఞప్తి చేసింది.
సామాజిక పరిస్థితి
త్రిపురలో అత్యధికంగా గిరిజనులున్నారు. రాష్ట్ర రాజకీయలను గిరిజనులే నిర్ణయిస్తారు. రాష్ట్రంలో ఎస్టి 31.76 శాతం, ఒబిసి 24.48 శాతం, ఒసి 25 శాతం, ఎస్సి 17.83 శాతం ఉన్నారు. హిందువులు 83.40 శాతం, ముస్లిం 8.60 శాతం, క్రైస్తవులు 4.35 శాతం, బౌద్దులు 3.41 శాతం ఉన్నారు. గిరిజనులలో త్రిపురి లేదా ‘దెబ్బర్‌మాన్’ కమ్యూనిటీ దాదాపు యాభై శాతం ఉంటారు. అయితే గిరిజనేతర జనాభా బెంగాలీలు, చాలా తక్కువ సంఖ్యలో మెయిథీ, విష్ణుప్రియ మణిపురిలు వివిధ కులాలు, ఉప కులాలకు చెందినవారిగ ఉన్నారు.
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీపీఎం పోటీ
రాంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు సిపిఎం అభ్యర్థి రతన్ దాస్ పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 19న మొదటి దశ లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరగనుంది. గత ఏడాది డిసెంబర్‌లో బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే సూరజిత్ దత్తా మరణించడంతో రాంనగర్ స్థానం ఖాళీ అయింది.
సీపీఐ(ఎం) కాంగ్రెస్ చెరొకటి
త్రిపురలో ఇండియా ఫోరం తరపున సిపిఎం, కాంగ్రెస్ చెరొక్క స్థానానికి పోటీ చేస్తున్నాయి. బిజెపి, ఐపిఎఫ్‌టి, తిప్ర మోతా పార్టీలతో కూడిన ఎన్‌డిఎ నుంచి బిజెపి రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎస్‌టి రిజర్వుడ్ తూర్పు త్రిపుర నియోజకవర్గం అభ్యర్థిగా సిపిఎం నేత రాజేంద్ర రియాంగ్ పోటీ చేస్తున్నారు. మరోవైపు పశ్చిమ త్రిపుర నియోజకవర్గంలో పిసిసి అధ్యక్షుడు ఆశిష్ కుమార్ సాహా పోటీ చేస్తున్నారు. త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానం నుండి సిట్టింగ్ ఎంపి రేవతికి టికెట్ నిరాకరించిన బిజెపి, ఆ స్థానంలో కీర్తి సింగ్ దేవ్ వర్మను అభ్యర్థిగా ప్రకటించింది. మాణిక్యం రాజ కుటుంబానికి చెందిన కీర్తిసింగ్ దేవ్, తిప్ర మోతా పార్టీ నేత ప్రద్యోత్ దేవ్ వర్మకు అక్క. తిప్ర మోత పార్టీ ఇటీవల ఎన్‌డిఎ కూటమిలో చేరి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. పశ్చిమ త్రిపుర నియోజకవర్గం నుంచి రాజ్యసభ ఎంపి విప్లవ్ కుమార్ దేవ్ ను బరిలోకి దింపింది.