అంబేద్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణ సాధన

– జయంతి వేడుకల్లో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్పూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏండ్లపాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్‌ నాయకత్వంలో కొనసాగించామని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌ తెలిపారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రజా పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేద్కర్‌ ఆశయాల ఆలోచనల మేరకు పదేండ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేసిందన్నారు. విద్యతోనే వికాసం, ప్రగతి, సమానత్వం వస్తుందనే ఆయన ఆలోచనతోనే 1,022 గురుకులాలు నెలకొల్పామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అది విగ్రహం కాదు.. విప్లవం అనే మాటను కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టడం కేసీఆర్‌కే సాధ్యమైం దన్నారు. సమాజంలో సమానత్వం రావాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.రాజ్యాంగం ప్రమాదంలో పడకూ డదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని హెచ్చరించారు.