– అంబేద్కర్ జయంతిలో ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో గత ప్రభుత్వాల హయాంలో విస్మరణకు గురైన వర్గాలకు, బడుగు, బలహీన వర్గాలకు కేంద్రంలోని మోడీ సర్కారు పెద్ద పీట వేస్తున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడానికి మోడీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఆదివాసీలకు, దళితులకు సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. తొలిసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదన్నారు. కేవలం విద్యా ఉద్యోగాలకే కాకుండా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కొంత మంది చేస్తున్న విషప్రచారాన్ని కొట్టిపడేశారు. అంబేద్కర్‌ను రెండు సార్లు ఓడించడానికి కాంగ్రెస్ ప్రయత్నించిదని విమర్శించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశానికి రక్షణగా నిలుస్తోందన్నారు. పేదరికం లేని దేశంగా మార్చడమే లక్ష్యంగా ప్రధాని మోడీ మ్యానిఫెస్టో విడుదల చేశారని కొనియాడారు.