రాజ్యం చేతిలో సహజవనరులుండాలి

– దేశంలో ఆర్థిక, సామాజిక, మహిళా సమానత్వం రావాలి
– వీటి కోసమే జీవితాంతం పోరాడిన అంబేద్కర్‌
– ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్న ఎన్‌డీఏ ప్రభుత్వం
– ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడిరచాలి : అంబేద్కర్‌ జయంతి సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
రాజ్యం చేతిలో సహజ వనరులుండటంతో పాటు దేశంలో ఆర్థిక, సామాజిక, మహిళా సమానత్వం రావాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తన జీవితాంతం పోరాడారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ కొనియాడారు. కానీ, నేడు అధికారంలో ఉన్న మోడీ సర్కారు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. అలాంటి బీజేపీ సర్కార్‌కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ అధ్యక్షతన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ. . దేశంలోని ప్రభుత్వాస్తులను, సహజ వనరులను మోడీ సర్కారు కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్న తీరును కండ్లకు కట్టినట్టు వివరించారు. దేశంలో ఆర్థిక సమానత్వం రావాలని అంబేద్కర్‌ కోరుకుంటే, బీజేపీ పదేండ్ల పాలనా విధానాలతో దేశంలో పేదల సంఖ్య 90 శాతానికి పెరిగిందనీ, దేశ సంపద మాత్రం కొందరి చేతుల్లో పేరుకుపోయిందని చెప్పారు. దేశంలో మహిళా సమానత్వం రావాలని అంబేద్కర్‌ పోరాడితే బీజేపీ మాత్రం ఏదో ఘనకార్యం చేసినట్టుగా స్త్రీలపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి పూలదండలేసి జైళ్ల నుంచి స్వాగతం పలుకుతున్న తీరును ఎండగట్టారు. దేశంలో మోడీ సర్కారు మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందనీ, మనుధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా అమలు చేసే కుట్ర జరుగుతున్నదని హెచ్చరించారు. అంబేద్కర్‌ కోరుకున్నట్టుగా ఆర్థిక, సామాజిక, మహిళా సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌ మాట్లాడుతూ..దేశంలో భూములను పేదలకు పంచాలని పార్లమెంట్‌ సాక్షిగా అంబేద్కర్‌ మాట్లాడారని గుర్తుచేశారు. నేటి పాలకులు పేదలకు భూములు పంచకపోగా ఉన్నవాటిని గుంజుకుని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. పేదల కోసం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టానికి, ప్రజాపంపిణీ వ్యవస్థకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని ఓడిరచాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్‌నాయక్‌ మాట్లాడుతూ.. మోడీ సర్కారు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తోందని విమర్శించారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తే రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పిన మోడీ సర్కారు మాటతప్పిందన్నారు. మళ్లీ మోడీ సర్కారు వస్తే వ్యవసాయ రంగం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. సీఐటీయూ సీనియర్‌ నేత పి.రాజారావు, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌ఎస్‌ఆర్‌ఏ ప్రసాద్‌, యాటల సోమన్న, కేవీఎస్‌ఎస్‌ రాజు, పి.సుధాకర్‌, ఎ.సునీత, సీఐటీయూ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.