– ఫ్లెక్సీలో ఫోటో పెట్టకపోవడం వర్గ పోరుకు నిదర్శనం
– ప్రోటోకాల్ పాటించని పురపాలక సంఘం
నవతెలంగాణ-నల్లగొండ
ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో జిల్లా కేంద్రంలో శాసనమండలి చైర్మెన్ గుప్త సుఖేందర్‌రెడ్డికి అవమానం ఎదురయింది. దశాబ్ది ఉత్సవాల ఫ్లెక్సీలో గుత్తా ఫోటో పెట్టకపోవడం మరో మారు బీఆర్ఎస్ వర్గ పోరుకు నిదర్శనమైంది. నల్లగొండ పురపాలక సంఘం ప్రోటోకాల్ పాటించకుండా గుత్తాను అవమానపరిచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల వేళ నల్లగొండలో బీఆర్ఎస్ వర్గ పోరు వీధి కెక్కింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రం నల్లగొండలో ప్రధాన రహదారిపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో భారీ స్వాగత ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలతో పాటు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఫోటోలను పెట్టారు. జిల్లా కేంద్రంలో అధికారికంగా జరిగే దశాబ్ది ఉత్సవాల్లో జాతీయ పతాకావిష్కరణ చేయనున్న శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫోటో మాత్రం ప్రధాన ఫ్లెక్సీలో పెట్టకపోవడం బీఆర్ఎస్ వర్గ పోరుకు నిదర్శనంగా నిలిచింది. కేవలం ప్రధాన ఫ్లెక్సికి అనుబంధంగా ఉన్న చిన్న రోడ్ సైడ్ ఫ్లెక్సీలో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫోటోను కౌన్సిలర్లతో కలిపి పెట్టగా, దానిని సైతం ప్రధాన ఫ్లెక్సీ క్లాత్‌తో కనిపించకుండా ఏర్పాటు చేశారు. కనీసం శాసనమండలి చైర్మెన్ ప్రోటోకాల్ సైతం పురపాలక సంఘం పాటించకుండా గుత్తాను అవమానించేలా రూపొందించిన ఫ్లెక్సీ వెనుక స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఒత్తిడే కారణమంటూ గుత్తా వర్గీయులు ఆరోపిస్తున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి కంచర్లకు పోటీగా నల్లగొండ నుండి రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే మున్సిపాలిటీ స్వాగత ఫ్లెక్సీలో సుఖేందర్‌రెడ్డి ఫోటోను కనిపించకుండా చేశారని గుత్తా వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు జిల్లా కేంద్రంలో అధికారికంగా జరిగే అధికారిక ఉత్సవాల్లో మండలి చైర్మెన్ సుఖేందర్రెడ్డియే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న వేళ రేగిన ఈ ఫ్లెక్సీ వివాదం ఉత్సవాలపైన, పార్టీ కార్యక్రమాలపైన ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతోందోనన్న చర్చను రేకెత్తించింది. గత శ్రీరామనవమి వేడుకల్లోనూ నల్లగొండ రామాలయం ఫ్లెక్సీలలో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫోటో పెట్టకపోవడం వివాదాస్పదమైంది. మరోవైపు పురపాలక సంఘం స్వాగత ఫ్లెక్సీకి కొద్ది దూరంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన గుత్తా అమిత్‌రెడ్డి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్లెక్సీలో మాత్రం ఎమ్మెల్యే కంచర్ల ఫోటో ఏర్పాటు చేయడం గమనార్హం. ఇటీవల గుత్తా అమిత్‌రెడ్డి నల్లగొండ సెగ్మెంట్లో తన కార్యకలాపాలు ముమ్మరం చేయడం సహజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లలో అసహనాన్ని రగిలించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సన్నాహాల సమీక్ష పేరుతో గుత్తా సుఖేందర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సహా ఇతర జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తదుపరి రోజునే కలెక్టరేట్లో కంచర్ల భూపాల్‌రెడ్డి సైతం అధికారులతో సమీక్ష చేశారు. అదే రోజు ఉత్సవాల జిల్లా నోడల్ అధికారి పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో మరొక సమీక్ష నిర్వహించారు. పోటా పోటీ సమీక్షలతో అధికారులు సైతం అసహనానికి గురయ్యారు. నేటి నుండి 21 రోజులపాటు రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుపుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం జిల్లా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది.