నామినేషన్ల స్వీకరణ హెల్ప్ డెస్క్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి
నామినేషన్ల స్వీకరణ, హెల్ప్ డెస్క్ సేవల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి వుండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే సూచించారు. సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో నామినేషన్లు, ఎన్ కోర్, హెల్ప్ డెస్క్ టీముల అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ఈ సందర్భంగా మాట్లాడుతూ..భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నామినేషన్స్ ప్రక్రియలో పరిశీలన, తిరస్కరణ ముఖ్యమైన అంశాలైనందున సరైన అవగాహన పొందాలన్నారు. పోటీ చేసే వ్యక్తి భారతదేశ పౌరుడు అయి వుండాలని, నామినేషన్ల స్క్రూటినీ తేదీ వరకు 25 సంవత్సరాల వయస్సు నిండి వుండాలని, ఎలాంటి నేరచరిత్ర ఉండకూడదని, దివాళా తీయడం, గత ఎన్నికలో పోటీ చేసి ఎన్నికల ఖర్చును సమర్పించని వారు అనర్పూలని అన్నారు.
           నామినేషన్స్ ప్రక్రియ 6 పార్టులుగా ఉంటుందని, మొదటి పార్టులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ, స్థానిక పార్లమెంట్ నియోజకవర్గ ఓటరు అయిన ఒక్క ప్రపోజర్ సంబంధించినదని, రెండవ పార్టులో ఇండిపెండెంట్, రిజిష్టర్డ్ పార్టీ సంబంధించి పది మంది ప్రపోజర్స్ సంబంధించినదని, మూడవ పార్టు గుర్తులు కేటాయింపు వివరాలకు సంబంధించినదని, నాలుగవ పార్టు నామినేషన్ తేదీ, సమయం వివరాలకు సంబంధించినదని, ఐదవ పార్టు రిటర్నింగ్ అధికారి చేత ఆమోదం, తిరస్కరణ సంబంధించినదని, ఆరవ పార్టు రశీదు సంబంధించినదని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ఎన్ కోర్ ద్వారా ఆన్లైన్ నమోదు చేయాలని, నామినేషన్ల ప్రారంభం నుండి ప్రతి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. హెల్ప్ డెస్క్ ద్వారా అభ్యర్ధులకు నామినేషన్లు, డిపాజిట్లు, ప్రపోజర్స్, గుర్తుల కేటాయింపు, ఫామ్ -26 సంబంధించిన విషయాలు, నోటరీ విషయాలపై సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. హెల్ప్ డెస్క్ లో  7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఓటరు జాబితాలతో  ఉండాలని, అభ్యర్ధుల ప్రమాణంపై, చెక్ లిస్ట్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియపై పూర్తి అవగాహన పొందాలని సూచిస్తూ పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ వేసే వారు జనరల్ కేటగిరీలో 25 వేలు, ఎస్.సి., ఎస్.టి. కేటగిరీలో 12 వేల 500 డిపాజిట్ చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్ కె.నర్సిరెడ్డి, ఆర్.హరినాధరెడ్డి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్, భువనగిరి ఆర్.డి.ఓ. అమరేందర్, తహశీలుదార్లు, డిప్యూటీ తహశీలుదార్లు పాల్గొన్నారు.