– అధికారులతో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ – వేములవాడ
ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి వేములవాడ, సిరిసిల్ల పట్టణ పరిధి లోని ప్రభుత్వ పాఠశాలలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం, తరగతి గదుల మైనర్, మేజర్ మరమ్మత్తులు, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకురావడం, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదికి విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతులు అమ్మ పాఠశాల కమిటీల ద్వారా జూన్ 10 వరకు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేయాల్సిన మరమ్మత్తు పనులు అదనపు తరగతుల నిర్మాణం టాయిలెట్స్, మొదలగు అభివృద్ధి పనుల కలెక్టర్ పరిశీలించి, ప్రాధాన్యత ప్రకారం పనులు వెంటనే ప్రారంభించాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టే పనులకు నిధులు ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతుందని, అభివృద్ధి పనుల ప్రతిపాదనలో 20 శాతం మేర నిధులు పనులు ప్రారంభించిన వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అవినాష్, ఇంజనీరింగ్ అధికారులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.