224 ఊదేశారు

224 ఊదేశారు– కోల్‌కతపై రాజస్థాన్‌ గెలుపు
– ఛేదనలో బట్లర్‌ అజేయ సెంచరీ
– సునీల్‌ నరైన్‌ శతకం వృథా
– కోల్‌కత 223/6, రాజస్థాన్‌ 224/8
నవతెలంగాణ-కోల్‌కత
రాజస్థాన్‌ రాయల్స్‌కు ఎదురులేదు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఆ జట్టు అలవోకగా ఛేదించింది. ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసి 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. 234 పరుగుల రికార్డు ఛేదనలో ఓపెనర్‌ జోశ్‌ బట్లర్‌ (107 నాటౌట్‌, 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సె,ంచరీతో చెలరేగాడు. రియాన్‌ పరాగ్‌ (34), రోవ్‌మాన్‌ పావెల్‌ (26) రాణించారు. యశస్వి జైస్వాల్‌ (19), సంజు శాంసన్‌ (12) సహా ధ్రువ్‌ జురెల్‌ (2), అశ్విన్‌ (8), హెట్‌మయర్‌ (0) వైఫల్యంతో రాయల్స్‌ ఓ దశలో 121/6తో ఓటమి కోరల్లో చిక్కుకుంది. కానీ జోశ్‌ బట్లర్‌ ఆఖరు వరకు క్రీజులో నిలిచి రాయల్స్‌కు సూపర్‌ విక్టరీ అందించాడు. అంతకుముందు, సునీల్‌ నరైన్‌ (109, 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతక విన్యాసంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఏడు మ్యాచుల్లో ఇది ఆరో విజయం కాగా.. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఆరు మ్యాచుల్లో ఇది రెండో పరాజయం.
నరైన్‌ మోత : టాస్‌ నెగ్గిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఈడెన్‌గార్డెన్స్‌లో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు ఆశించిన ఆరంభం ఇవ్వలేదు. ఫామ్‌లో ఉన్న ఫిల్‌ సాల్ట్‌ (10) నిరాశపరిచాడు. కానీ పించ్‌ హిట్టర్‌ సునీల్‌ నరైన్‌ (109) తగ్గలేదు. 13 ఫోర్లు, 6 సిక్సర్లతో విశ్వరూపం చూపించాడు. ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 29 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన సునీల్‌ నరైన్‌.. కెరీర్‌ తొలి టీ20 సెంచరీని 49 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో అందుకున్నాడు. యువ ఆటగాడు రఘువంశీ (30) ఐదు ఫోర్లతో అలరించాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (11), అండ్రీ రసెల్‌ (13) నిరాశపరిచారు. కానీ డెత్‌ ఓవర్లలో రింకూ సింగ్‌ (20 నాటౌట్‌) అదరగొట్టాడు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో మెరిసి కోల్‌కత నైట్‌రైడర్స్‌కు అదిరే ముగింపు అందించాడు. కోల్‌కత నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ (1/31), అవేశ్‌ ఖాన్‌ (2/35) రాణించారు.