అదరగొట్టారు

They were upset– సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
– తెలంగాణా నుంచి అనన్యారెడ్డికి మూడో ర్యాంకు
– ఆలిండియా టాపర్‌గా ఆదిత్య శ్రీవాస్తవ
– టాప్‌ ఐదు ర్యాంకుల్లోని ముగ్గురు ఇప్పటికే ఐపీఎస్‌లు
– ఢిల్లీ జామియా వర్సిటీ నుంచి 31 మంది ఎంపిక
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్‌ సర్వీసెస్‌ 2023 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌), ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)కి 1016 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 180 మంది ఐఏఎస్‌లు, 200 మంది ఐపీఎస్‌లుగా మారనున్నారు.
లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఆల్‌ ఇండియా మొదటి ర్యాంక్‌ సాధించగా… అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంక్‌, అనన్యారెడ్డి(తెలంగాణ)కి మూడో ర్యాంకు లభించింది. టాప్‌ ఐదు ర్యాంకుల్లోని ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఐపీఎస్‌ అధికారులు కావటం విశేషం. ఒకటవ ర్యాంక్‌ సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ, నాల్గొవ ర్యాంక్‌ పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌, ఐదో ర్యాంక్‌ రోహణి హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ శిక్షణ పూర్తి చేస్తున్నారు. యూపీఎస్సీ ప్రకటించిన సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. టాప్‌ వందలోపు మూడు ర్యాంకులను సాధించి సత్తా చాచారు. మూడో ర్యాంకు అనన్యారెడ్డి, 27వ ర్యాంకు నందాల సాయికిరణ్‌, 82వ ర్యాంకు మెరుగు కౌశిక్‌ పొందడం గమనార్హం.
గత 11 ఏండ్లలో ఓ ఐపీఎస్‌ అధికారి సర్వీస్‌లో ఉండగా ఈ పరీక్షలో ఆల్‌ ఇండియా మొదటి ర్యాంక్‌ సాధించడం ఇదే తొలిసారి. గతంలో 2013లో ఐపీఎస్‌ అధికారి గౌరవ్‌ అగర్వాల్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఆల్‌ ఇండియా మొదటి ర్యాంక్‌ సాధించారు. ఆదిత్య శ్రీవాస్తవ గతేడాది ఐపీఎస్‌లో ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐపీఎస్‌ శిక్షణ తీసుకుంటున్నారు. ఇది అతనికి మూడో ప్రయత్నం కాగా మొదటిసారి ప్రిలిమ్స్‌లో ఎంపిక కాలేదు. ఆదిత్య ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌లో బీటెక్‌ చేశారు. అక్కడ కూడా టాపర్‌గా నిలిచారు. ఆదిత్య తండ్రి అజరు శ్రీవాస్తవ కాగ్‌లో ఆడిట్‌ అధికారి. చిన్నప్పటి నుంచి కొడుకు ఎక్స్‌ట్రా ఆర్డినరీ అని తల్లి అభా శ్రీవాస్తవ చెప్పారు.
జామియా వర్సిటీ నుంచి 31 మంది ఎంపిక
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి 31 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 11 మంది మహిళలున్నారు. ఈ విద్యార్థులందరూ జేఎంఐకు చెందిన రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీ (ఆర్‌సీఏ) నుంచి చదువుకున్నారు. జేఎంఐ విద్యార్థి నౌషీన్‌ ఆల్‌ ఇండియా తొమ్మిదొవ ర్యాంక్‌ సాధించారు. గత రెండేండ్లుగా యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. ఇషితా కిషోర్‌ 2022లో ఏఐఆర్‌లో నెంబర్‌ 1 ర్యాంకును సాధించింది. శృతి శర్మ యూపీఎస్‌సీ సీఎస్‌ఈ 2021లో ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 1ని సాధించింది. 2022లో గరిమా లోహియా, ఉమా హారతి ఎన్‌ , స్మృతి మిశ్రా టాప్‌ ర్యాంకర్లలో ఉన్నారు. 2021లో మొదటి మూడు ర్యాంకులు మహిళలవే. అంకితా అగర్వాల్‌కు ఏఐఆర్‌ 2, చండీగఢ్‌కు చెందిన గామిని సింగ్లా ఏఐఆర్‌ 3ని పొందారు.
2023లో మహిళల ఉత్తీర్ణత శాతం 34
గత ఐదేండ్లలో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మహిళల శాతం పెరిగింది. 2018 , 2019లో మహిళా ఉత్తీర్ణత శాతం 24 శాతం కాగా 2020లో 29 శాతానికి చేరుకుంది. అదే సమయంలో, 2021లో ఇది 3 పాయింట్లు తగ్గి 26 శాతానికి చేరుకుంది. 2022లో ఈ సంఖ్య మరోసారి 34 శాతానికి పెరిగింది. గతేడాది ఎంపికైన 933 మంది అభ్యర్థుల్లో 320 మంది మహిళలున్నారు.
సివిల్స్‌లో మెరిసిన ‘అనన్య’ సొంత ప్రిపరేషన్‌తో తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు
యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ తుది ఫలితాల్లో తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకుతో మెరిశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి తన తొలి ప్రయత్నంలోనే అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌ గీతం హైస్కూల్‌లో చదివిన ఆమె ఇంటర్‌ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్‌ కాలేజీలో డిగ్రీ చదివారు. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు.
‘ సివిల్స్‌’ పరీక్ష ఎంతో కఠినంతో కూడినది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్‌కు ఎంపికవుతారని అనన్య భావించినప్పటికీ.. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని ఆమె చెప్పారు. సొంత ప్రణాళికతోనే రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివినట్టు తెలిపారు. చిన్నప్పటినుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్టు తెలిపారు.
కరీంనగర్‌వాసి సాయికిరణ్‌కు 22వ ర్యాంకు
యూపీఎస్సీ ప్రకటించిన సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్‌ 27వ ర్యాంకు సాధించారు. దీంతో ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సివిల్స్‌లో కౌశిక్‌ అదుర్స్‌!
సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా క్యాప్‌ జెమినీలో ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేరైన కౌశిక్‌.. తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. ఓయూలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన.. ఢిల్లీలో ఎంబీఏ చేశారు. ‘అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటల పాటు ప్రిపేర్‌ అయినట్టు ఆయన మీడియా’ తో చెప్పారు. ”ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు సివిల్స్‌కు ప్రిపరేషన్‌ మొదలు పెట్టా. ఆ తర్వాత ఏడాది పాటు జాబ్‌ చేశా. ప్రిలిమ్స్‌ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి మెయిన్స్‌ రాశా. ఐఏఎస్‌ అవ్వాలనేది నా లక్ష్యం. సెలెక్టైతే చాలనుకున్నా. కానీ 100లోపు ర్యాంకు వస్తుందని మాత్రం అసలు ఊహించలేదు. నాన్న కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లో పనిచేస్తారు. అమ్మ గృహిణి. నాన్నకు తెలిసిన కొందరు ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లను కలవడం, ఇతరుల గైడెన్స్‌తో పాటు కొన్ని స్టాండర్డ్‌ సోర్సులు నాకు బాగా ఉపయోగపడ్డాయి. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా వికలాంగుల కోసం, ఆరోగ్య రంగంపై పనిచేయాలని ఉంది” అని అన్నారు.
సివిల్స్‌ ర్యాంకులు పొందిన తెలుగు విద్యార్థులు
దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు, నందాల సాయికిరణ్‌ 27వ ర్యాంకు, మెరుగు కౌశిక్‌ 82వ ర్యాంకుతోపాటు పెంకీసు ధీరజ్‌రెడ్డి 173, జి అక్షరుదీపక్‌ 196, గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ 198, నిమ్మనపల్లి ప్రదీప్‌రెడ్డి 382, బన్న వెంకటేశ్‌ 467, కడుమూరి హరిప్రసాద్‌రాజు 475, పూల ధనుష్‌ 480, కె శ్రీనివాసులు 526, నెల్లూరు సాయితేజ 558, కిరణ్‌ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్‌ 580, పోతుపురెడ్డి భార్గవ్‌ 590, వద్యావత్‌ యశ్వంత్‌ నాయక్‌ 627, కె అర్పిత 639, ఐశ్వర్య నెల్లిశ్యామల 649, సాక్షికుమారి 679, చౌహాన్‌ రాజ్‌కుమార్‌ 703, గాదె శ్వేత 711, వి ధనుంజరుకుమార్‌ 810, లక్ష్మీబానోతు 828, ఆదా సందీప్‌కుమార్‌ 830, జె రాహుల్‌ 873, హనిత వేములపాటి 887, కె శశికాంత్‌ 891, కెసారపు మీన 899, రామూరి సాయి అలేఖ్య 938, గోవద నవ్యశ్రీ 995 ర్యాంకులను సాధించారు.
సివిల్‌ టాపర్స్‌కు సీఎం అభినందనలు
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీపీఎస్సీ) 2023 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఈసారి 50 మందికి పైగా సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికవడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు