హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం: మట్టపల్లి శ్రీశైలం యాదవ్

నవతెలంగాణ తుంగతుర్తి
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పూర్తిగా విఫలమయ్యాయని తుంగతుర్తి వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్ అన్నారు.ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం…. ఎన్నికల అనంతరం ప్రజలను నట్టేట ముంచడమే కాంగ్రెస్, బీజేపీల నైజం అన్నారు.మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు.కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు అడిగే అర్హత లేదని,ఏం సాధించారని ఓట్లు అడుగుతున్నారని అన్నారు.బిజెపి ప్రకటించిన మేనిఫెస్టోలో దేశ జనాభాలోని 60 శాతం జనాభా గల బీసీల సంక్షేమం గురించి లేకపోవడం చాలా బాధాకరమన్నారు.స్వాతంత్ర్యం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీల చిరకాల కోరిక అయిన బీసీ రిజర్వేషన్ల పెంపు,బిసి కుల గణన, మహిళా బిల్లుల్లో బీసీ మహిళలకు వాటా కల్పించుట, బీసీల సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఏ అంశాలు కూడా మేనిఫెస్టోలో చేర్చకపోవడం చూస్తుంటే బీసీలను అణిచివేయాలనే కుట్రలకు ఆజ్యం పోసినట్లు ఉందన్నారు.బీసీల సంక్షేమాన్ని విస్మరించే పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.పది సంవత్సరాల బీజేపీ పాలనలో ఏ ఒక్క హామీ అమలు కాలేదని అన్నారు. అమలుకు సాధ్యం కానీ మాయ మాటలతో అబద్ధపు హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.మొదటి సంతకం 6 గ్యారంటీల పైనే చేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేసిందని ప్రశ్నించారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి క్వింటాకు బోనస్ గా 500 రూపాయలు, వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందే 15,000 రూ. రైతుల ఖాతాలో జమ అవుతాయని చెప్పి విస్మరించారన్నారు.పింఛన్లు 4000 రూపాయలకు పెంచుతామని,ప్రభుత్వ ఉద్యోగాల లాగా ఆడబిడ్డలకు ప్రతి నెల ఒకటో తేదీనే 2500 రూపాయలు,నిరుద్యోగ భృతి 4000 రూపాయల హామీలు అమలుకు నోచుకోలేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధతతోనే కరువు ఏర్పడిందని, బీఆర్ఎస్ పాలనలో పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ నేడు కాంగ్రెస్ అసమర్ధుల వల్ల ఎడారిగా మారిందని, రైతుల ఆత్మహత్యలకు మూలకారణమైందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు.విద్యార్థి సంఘం నుండి అంచెలంచలుగా ఎదుగుతూ వస్తున్న భువనగిరి పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే హామీల అమలుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని, కడుపులో పెట్టుకొని కాపాడుకున్న రైతుల్ని కాంగ్రెస్ పార్టీ ఆగం చేసింది అన్నారు. నియోజకవర్గ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు.అక్కరకు రాని చుట్టం.. మొక్కినా వరం ఇవ్వని దేవుళ్ళు ఉన్నా లేకున్నా ఒక్కటే అన్నట్లుగా తెలంగాణకు ఏమీ చేయని బిజెపి కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఓటేయాలని అన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.