నవతెలంగాణ – ఆళ్ళపల్లి : మండల కేంద్రంతో పాటు మర్కోడు, తదితర గ్రామాల్లోని రామాలయాలను శ్రీరామ నవమి సందర్భంగా మంగళవారం అర్థరాత్రి వరకు భక్తులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అందులో భాగంగా బుధవారం జరిగిన సీతారాముల కళ్యాణం దాదాపు అన్ని గ్రామాల్లో కన్నుల పండువగా సాగింది. ఆళ్ళపల్లి, మర్కోడు గ్రామాల్లో జరిగిన సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణ కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కాగా, ఆళ్ళపల్లి రామాలయానికి ఓ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో మాదిరి ఐదు రోజులపాటు కొనసాగటం గమనార్హం. ముందురోజు అభిషేకాలు, ఎదుర్కోళ్ల మహోత్సవం, రెండోరోజు కళ్యాణం, మూడోరోజు దొంగల దోపిడి, నాల్గోరోజు నాగవెల్లి, చివరిరోజు వసంతోత్సవంతో శ్రీరామ నవమి ఉత్సవ కార్యక్రమాలు ముగియనున్నాయి. ఈ కళ్యాణం కార్యక్రమానికి ఆయా చోట్ల హాజరైన ప్రముఖుల్లో గౌరిశెట్టి నాగభూషణం, అనుమోల వెంకటేశ్వర్లు (మర్కోడు), తాళ్లపల్లి రామ్మూర్తి, నరెడ్ల వెంకన్న, తాళ్లపల్లి నాగేశ్వరరావు, గౌరిశెట్టి శ్రీనివాసరావు, అబ్బు నాగేశ్వరరావు, బూరుగడ్డ రాములు, నరెడ్ల శ్రీనివాసరావు, సిరినోముల శ్రీనివాస్, తులం ముత్తిలింగం, సిరినోముల నరేష్, నువ్వుల నర్సింహారావు, సిరినోముల సతీష్, గౌరిశెట్టి చంద్రశేఖర్, బూరుగడ్డ నాగేష్, బూర్ణ రాంబాబు, రఢం నారాయణ, సతీష్, తదితరులు ఉన్నారు.