ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సాగిస్తున్న ఎన్నికల ప్రచారం బాహాటంగానే మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతోంది. రాముడి ఆలయాన్ని ఎన్నికల అంశంగా మార్చింది. రాముడికి, రాముడి ఆలయానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా వున్నాయని నిందిస్తోంది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించడమే. పైగా బీజేపీ నేతలు కొన్ని ప్రసంగాల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ మతపరమైన మనోభావాలకు ఆజ్యం పోయడం ఇండియన్ పీనల్ కోడ్‌లోని కొన్ని నిబంధనల ప్రకారం నేరం కూడా.ఇక్కడ ప్రధాన దోషి నరేంద్ర మోడీనే. ఎన్నికల సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు కొన్నిటిని పరిశీలిస్తే, పాలక పార్టీ అగ్రనేత మత భావాలను ఏ విధంగా బహిరంగంగా ప్రదర్శిస్తున్నారో కనిపిస్తుంది.
బీహార్‌లోని నవాడాలో ఏప్రిల్ 7న జరిగిన ఒక ఎన్నికల సభలో మోడీ ప్రసంగిస్తూ, ”అయోధ్యలో రాముడికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, ఆర్జెడిలు అనేక ప్రయత్నాలు చేశాయి” అని ఆరోపించారు. ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వారు బహిష్కరించారని చెప్పారు. రాముడి పట్ల ఎందుకింత శతృత్వం? అని ప్రశ్నించారు. పైగా రామనవమి కూడా వస్తోంది, కాబట్టి ఈ పాపం చేసిందెవరో మర్చిపోవద్దు అంటూ ప్రజలను కోరారు. ప్రజల మత భావాలను రెచ్చగొట్టి, ఆడుకోవడం తప్ప ఇది మరొకటి కాదు. పైగా రాముడికి వ్యతిరేకంగా వున్నారంటూ ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేయడమే. ఇవన్నీ కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించడం కిందకే వస్తాయి. అంతేకాదు, విద్వేషాలను రెచ్చగొడుతున్నందుకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడానికి అవకాశాలు వున్నాయి.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఏప్రిల్ 6వ తేదీన ఒక సభలో ప్రసంగిస్తూ, అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన సభ్యులను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారని తప్పుడు ఆరోపణలు చేస్తూ మోడీ ఆ పార్టీపై దుష్ప్రచారం చేశారు. ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వ్యతిరేకించిన వారు మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19కి రెండు రోజుల ముందుగా జరిగే రామనవమి ఉత్సవాలను కూడా వ్యతిరేకిస్తారంటూ తప్పుడు సూచనలు చేశారు. రాజకీయ ప్రత్యర్ధికి వ్యతిరేకంగా మతభావాలను తీవ్రంగా రెచ్చగొట్టడమే ఇది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో ఏప్రిల్ 9వ తేదీన మరోసారి ఇలాంటి ప్రసంగాన్నే చేశారు. అయోధ్య రామాల యంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గనలేదంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీపై దాడి చేశారు. ఇది రాముడిని అవమానించడమేనని ఆయన ప్రకటిం చేశారు. ఇండియా బ్లాక్‌లోని ఈ వ్యక్తులు రామాలయం అంటే చాలా కాలం నుండి ద్వేషంతో వున్నారని ఆరోపించారు. ‘ఇండియా’ బ్లాక్ రామాలయం పట్ల విద్వేషాన్ని పెంచి పోషించిందని ఆరోపిస్తూ మోడీ విద్వేష ప్రసంగం సాగించారు.ఇవి, మోడీ ఇటీవల కాలంలో చేసిన కొన్ని ప్రసంగాలు మాత్రమే. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతును సంపాదించడం కోసం రాముడిని, రామాలయాన్ని మోడీ బాగా వాడుకుంటున్నారు.
ఉదాహరణకు, ఏప్రిల్ 6న ఘజియాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో మోడీ పాల్గన్నారు. ఆ సందర్భంగా పాటలు ఆలపించారు. ”జో రామ్ కో లాయే హై, హమ్ ఉన్కో లాయింగే” (ఎవరైతే రాముడిని మా దగ్గరకు తెచ్చారో వారికి అధికారం కట్టబెడతాం) అంటూ ఆ పాటల్లో సాహిత్యం సాగింది. ”భారత్ కా బచ్చా బచ్చా జై శ్రీరామ్ బోలేగా” అంటూ నినాదాలు చేశారు. మతపరమైన నినాదం ‘జై శ్రీరామ్’ బీజేపీ రాజకీయ ఉద్దేశ్యంగా మారిపోయింది. అమిత్ షా, ఆదిత్యనాథ్ వంటి ఇతర బీజేపీ నేతలు కూడా ఇదే ధోరణిలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. కానీ దీనికి ముందుగా ఆ పోకడను నిర్దేశించింది మాత్రం ప్రధాని మోడీనే.” ఓట్లను సంపాదిం చడం కోసం కుల లేదా మత భావాలను రెచ్చగొట్టరాదు. మసీదులు, చర్చిలు, ఆలయాలు లేదా ఇతర ఆరాధనా స్థలాలను ఎన్నికల ప్రచారాలకు వేదికలుగా ఉపయోగించ రాదు.” అని ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేర్కొంటోంది. అయోధ్యలో రాముడికి గుడి కట్టించి, ప్రాణ ప్రతిష్ట చేసిన వారికే ఓటు వేయాల్సిందిగా మోడీ తన ప్రసంగాల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పైగా, కేవలం ఎన్నికల ప్రచారాంశంగా ఆలయాన్ని ఉపయోగించడం కాదు, బీజేపీ ఎన్నికల ప్రచారంలోనే కీలకమైన అంశంగా రామాలయం మారిపోయింది.
ప్రధాని మోడీ చేసిన ఎన్నికల ప్రసంగాల గురించి సీపీఐ(ఎం), ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా చేసిన ప్రసంగాలపై ఎన్నికల కమిషన్‌కు ఇలాగే ఫిర్యాదులు చేశారుకానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎలాంటి చర్య తీసుకోరాదన్న నిర్ణయంపై ఎన్నికల కమిషనర్లలో ఒకరు అసమ్మతి వ్యక్తం చేశారని తర్వాత వెల్లడైంది. ఆ కమిషనర్ అశోక్ లావాసా భార్య, కుమారుడిని ఆదాయపన్ను శాఖ అధికారులు ఇంటరాగేట్ చేసి, వేధించడంతో తదనంతర కాలంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈసారి ఎన్నికల కమిషన్‌కు ఇది పరీక్ష కానుంది. ఎన్నికల ప్రకటన సందర్భంగా వివాదాస్పదమైన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం నిబంధనల కింద ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించిన తర్వాత ఎన్నికల కమిషన్ నిజంగానే స్వతంత్ర సంస్థ అని, ప్రభుత్వం పట్ల పక్షపాతంగా వ్యవహరించదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే వుంది.
ఆధిపత్య హిందూత్వ కార్యాచరణను తమ మతపరమైన ఎజెండాగా ముందుకు తీసుకెళుతూ పాలక పార్టీ, ప్రధాని దీన్ని సాధారణీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఒత్తిళ్లకు ఎన్నికల కమిషన్ తలొగ్గకూడదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే.. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరిగే వాతావరణాన్ని నాశనం చేస్తే.. ఎన్నికల ప్రచారం ఏ రూపంలో వున్నా..దానిని అడ్డుకోవడానికి, భగం చేయడానికి కచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిందే.
(ఏప్రిల్ 10 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)