‘వారసత్వ సంపద’ను కాపాడుకోవాలి

'వారసత్వ సంపద'ను కాపాడుకోవాలియునెస్కో ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఏప్రిల్‌ 18వ తేదీన ”ప్రపంచ వారసత్వ దినోత్సవం” నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆయా దేశాల్లో ఉన్న చారిత్రక, ప్రకృతి కట్టడాలను, నిర్మాణాలను కాపాడు కోవడానికి, భవిష్యత్తు తరాలకు అందించటానికి అనేక కార్యక్రమాలతో ముందుకుసాగుతు న్నారు. ఫ్రాన్స్‌లోని ఈఫిల్‌ టవర్‌, చైనా వాల్‌, మనదేశంలో తాజ్‌మహల్‌ వంటివి చూడటానికి లక్షల సంఖ్యలో పర్యా టకులు వెళ్తూ ఉంటారు. ఈ 2024కు గాను ”డిస్కవరీ అండ్‌ ఎక్స్‌ పీరియన్స్‌ డైవర్సిటీ” అనే థీమ్‌తో ప్రపంచమంతా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ది. ప్రపంచవ్యాప్తంగా 1199 వారసత్వ సంపద నిలయాలు, 168 దేశాల్లో ఉన్నట్లు యునెస్కో పేర్కొంది. వీటిలో 933 కల్చరల్‌, 227 నేచురల్‌, 39 మిక్సిడ్‌ నిర్మాణాలు, కట్టడాలు ప్రకృతి సంపదలున్నాయి. ఇక మనదేశంలో మొత్తం 42 ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. 2023 సెప్టెంబర్‌లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌, కర్నాటకలోని హోయశాలలు నిర్మించిన దేవాలయాలు ప్రపంచవారసత్వ సంపదలో భాగమయ్యాయి.
వివిధ దేశాల్లో, వివిధ కాలాల్లో నిర్మించిన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటి ద్వారా ఆనాటి పరిపాలన, కళానైపుణ్యం, ఠీవి, హుందాతనం, నాగరికత పరిపాలన అందరికీ తెలుస్తోంది.వీటిలో భాగంగా కోటలు (ఫోర్ట్స్‌), పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, ప్రకృతి అద్భు తాలు రక్షించుకోవాలి. మనదేశంలో ఎర్రకోట, ఆగ్రాకోట, తాజ్‌మహల్‌, కజిరంగ నేషనల్‌ పార్క్‌, దిల్‌వారా, కోణార్క్‌ దేవాలయాలు, ఎల్లోరా గుహలు, రామప్ప దేవాలయం వంటివి ఎన్నో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. వీటన్నిటినీ పరిరక్షించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి.బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలి. కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా చూడాలి. ఆక్రమణలకు గురికా కుండా ప్రయత్నించాలి. ముఖ్యంగా వివక్షలతో, ప్రాంతీయ, మత విద్వేషాలతో నిర్మాణాలను కూలగొట్టడం, ప్రాధాన్యత తగ్గించటం చేయ రాదు. చరిత్ర ఆనవాళ్లు చెరిపేయకూడదు. చట్టాల ద్వారా వాటిని ఎప్పటికప్పుడూ సంరక్షిం చాలి. అప్పుడే నాటి కళానైపుణ్యం, నిర్మాణశైలి, వాడిన పదార్థాలు అవగాహన చేసుకోవడానికి భవిష్యత్‌ తరానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పర్యాటక రంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవం. విదేశీయులు ఇటువంటి ప్రదేశాలు సందర్శిం చడం ద్వారా ఆయా దేశాలకు విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. దేశాలు కూడా ఆర్ధికంగా అభివృద్ధి చెందుతాయి. ప్రపంచ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మెరుగవుతాయి.
పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంతోనే సింగపూర్‌, మలేషియా, మాల్దీవులు, స్విట్జర్లాండ్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు అభివృద్ధి చెందాయనే విషయం అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా చాలా ప్రదేశాలు వారసత్వ సంపదతో నిండి ఉన్నాయి. బొర్రా గుహలు, లేపాక్షి నంది, గోల్కొండ కోట, జోగులాంబ ఆలయం వంటివి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఆ దిశగా కేంద్రం చేస్తున్న కృషి సరిపోవడం లేదు. ఇటువంటి ప్రదేశాలు, కట్టడాలు దర్శించడం ద్వారా అనేక చారిత్రక విషయాలు, విశిష్టతలు తెలుస్తాయి. ప్రస్తుతానికి ప్రపంచంలోనే ఇటలీలో 59 వారసత్వ సంపద ప్రదేశాలతో ముందంజలో ఉంది. మనదేశంలో కూడా మరెన్నో వారసత్వ సంపద ప్రదేశాలుగా గుర్తింపు పొందడానికి కృషి చేస్తే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశమున్నది. దీంతో పాటు కేంద్ర బడ్జెట్‌ లోనూ పర్యాటక రంగానికి ప్రత్యేక వాటా పెంచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లడం, బడ్జెట్‌లోనూ కోతలు విధించడం చూస్తూనే ఉన్నాం. అయితే తమ వారసత్వ సంపదను కాపాడుకుంటూ యునెస్కో గుర్తించేలా ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉన్నది. అదేవిధంగా నాటి శిల్ప సంపదను రక్షించుకోవడానికి కూడా తగిన శ్రద్ధ తీసు కోవాలి. అందుకుగాను బడ్జెట్‌లో తగిన వాటా ను సమకూర్చుతూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
– ఐ.ప్రసాదరావు
6305682733