బీజేపీ గూండాల ముఠాగా ఈడీ

– సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి గోవిందన్‌ విమర్శ
అలపుజ: బీజేపీ గూండాల ముఠాగా ఈడీ వ్యవహరిస్తుందని సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోనిందన్‌ బుధవారం విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌ కుమార్తె టి వీణా యాజమాన్యంలోని ఎక్సాలాజిక్‌ సొల్యూషన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు చెందిన నెలవారీ చెల్లింపులు వివాదంపై ఈడీ దర్యాప్తు గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దర్యాప్తుపై సీపీఐ(ఎం) స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు.
అయితే 2024 ఎన్నికలకు ముందు బీజేపీకి అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టించేందుకు ఇడి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ‘ఈడీ విచారణ చేసి ఎవరినైనా అరెస్టు చేయనివ్వండి. ఈడీ అనేది బీజేపీ, కేంద్ర ప్రభుత్వ గూండాల ముఠా. ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించడం లేదు. ఏప్రిల్‌ 26 తరువాత ఈడీ దర్యాప్తు హంగామా ముగుస్తుంది’ అని గోవిందన్‌ అన్నారు. ఈ వివాదంలో ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడాన్ని ఖండించారు.
అలాగే, కరువన్నూరు బ్యాంకు కుంభకోణం విషయంలోనూ ప్రధానమంత్రి మోడీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘ఈ కుంభకోణం దర్యాప్తులో క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తులో కనుగొన్న విషయాలకు మించి ఈడీ ఏమీ కనుగొనలేదు.
మెచ్యూర్డ్‌ డిపాజిట్లలో కేవలం రూ 51 కోట్లు మాత్రమే రావాల్సి ఉంది. ఎక్కువ మంది బ్యాంక్‌లో తమ ఖాతాలను పునరుద్దరించుకున్నారు. కానీ ప్రధానిమంత్రి మాత్రం ఒక దిగువస్థాయి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలా మట్లాడుతున్నారు’ అని గోవిందన్‌ పేర్కొన్నారు.