– పెద్దపల్లి బరిలో వెంకటేశ్‌ను దింపే యత్నం
– నల్లగొండ అభ్యర్థి సైదిరెడ్డి అభ్యర్థిత్వంపైనా గుర్రు
– మార్చాల్సిందేనంటూ పట్టుబడుతున్న జిల్లా నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ఎంపీ అభ్యర్థుల మార్పు అంశం మరోమారు చర్చనీయాంశమవుతున్నది. పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేశ్‌ను బరిలోకి దింపాలని యత్నిస్తోంది. ఆ దిశగా ఢిల్లీ నాయకత్వం వడివడిగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రచారంపై నిఘా పెట్టిన నాయకత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అభ్యర్థులు నియోజకవర్గాలు దాటకుండా ప్రతిరోజూ ప్రచారపర్వంలో దూకుడు పెంచాలని ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా తన నియోజకవర్గాన్ని, హైదరాబాద్‌ను విడిచి ఎక్కడకు వెళ్లడం లేదు. ఆయన ప్రచార పర్వంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి నుంచి ఆ పార్టీ తరఫున బరిలో దిగిన శ్రీనివాస్ బలమైన అభ్యర్థి కాడనీ, ప్రచారంలోనూ వెనుకబడుతున్నాడని అమిత్‌షా టీమ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నది. ఆ నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి వివేక్ పోయిన తర్వాత బీజేపీకి పెద్దపల్లిపై పెద్దగా పట్టు లేకుండా పోయింది. వివేక్ కాంగ్రెస్‌కుపోయి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆయన కొడుకు గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మారాడు. గులాబీ పార్టీలో సీటు దక్కదనే నిర్ధారణకు వచ్చిన సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేశ్ కాంగ్రెస్‌లో చేరాడు. నేతకాని వెంకటేశ్‌కు కాంగ్రెస్‌లోనూ నిరాశే ఎదురైంది. చర్చోపచర్చల తర్వాత వంశీ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ ఖరారు చేసింది. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న నేతకాని వెంకటేశ్‌ను బీజేపీ దగ్గరకు తీసుకుంటున్నది. ఆ నియోజకవర్గం నుంచి ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. దీనికి ససేమిరా అంటున్న గోమాస శ్రీనివాస్‌ను బుజ్జగించేందుకు యత్నిస్తోంది. సీటు కన్ఫామ్ చేస్తేనే పార్టీలోకి వస్తానని వెంకటేశ్ మెలిక పెట్టినట్టు తెలిసింది. పెద్దపల్లి అభ్యర్థి మార్పుపై రెండు, మూడు రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచిన సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ జిల్లా యంత్రాంగం అంగీకరించే పరిస్థితిలో లేదు. రాష్ట్ర నాయకత్వంలోని కొందరు కీలక నేతలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని నేటికీ బలంగా వ్యతికిస్తున్నారనే ప్రచారముంది. ఆర్థిక అంగుఅర్భాటాలున్న తేరా చిన్నపురెడ్డినిగానీ, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బలమైన ఓటుబ్యాంకు ఉన్న బీసీ సామాజిక తరగతికి చెందిన రామరాజు యాదవ్‌ను గానీ బరిలో దింపాలనే ఒత్తిడి రాష్ట్ర నాయకత్వంపై ఉంది. సామాజికంగా ఓకేగానీ, ఆర్థికంగా మిగతా ఇద్దరితో రామరాజు సరితూగడనే చర్చనడుస్తున్నది. మొత్తంగా ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తారా? అట్లాగే కొనసాగిస్తారా? అలాగైతే సీటుపై ఆశపెట్టుకుని పార్టీలో చేరిన నేతలకు ఏవిధంగా సర్దిచెప్తారు? తదితర అంశాలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.