పదేండ్లలో నోటి ఆరోగ్యానికి కేటాయించిన నిధులెన్ని?

– వివరాలు లేవంటూ చేతెలెత్తేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ సర్కారు గత పదేండ్లుగా ఆరోగ్య రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందనే విమర్శలను ఎదుర్కొంటున్నది. ప్రజారోగ్య రంగానికి నిధుల కేటాయింపులు తగ్గిస్తుండటంతో అనివార్యంగా ప్రజలు ప్రయివేటు వైద్యం వైపు నెట్టబడుతున్నారు. దీనికి తోడు గత పదేండ్లలో అమలు చేసిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యల గురించి అడిగితే చెప్పలేని పరిస్థితిలో కేంద్రంలోని ఆరోగ్యశాఖ ఉంది. ఆల్‌ ఇండియా డెంటల్‌ స్టూడెట్స్‌ అండ్‌ డెంటల్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ నోటి ఆరోగ్యానికి సంబంధించి జాతీయ స్థాయిలో 2014 నుంచి 2024 వరకు పదేండ్ల పాటు కేటాయించిన నిధులెన్ని? అంటూ సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరింది. నోటి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు, నోటికి సంబంధించిన రోగాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలను తెలపాలని ఈ ఏడాది మార్చి 5న ఆ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ మహ్మద్‌ మంజూర్‌ కోరారు. దంత ఆరోగ్యంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ, పరిశోధన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో పాటు అసోసియేషన్‌ అడిగిన వివరాలేవి అందుబాటులో లేవంటూ ఆరోగ్యశాఖ చేతులెత్తేసింది.
పారదర్శకత, జవాబుదారీతనమేది? డాక్టర్‌ మహ్మద్‌ మంజూర్‌
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల్లేవంటూ ఇచ్చిన సమాధానం పట్ల ఆల్‌ ఇండియా డెంటల్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ మహ్మద్‌ మంజూర్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డేటా లేదని చెప్పడం పేద ప్రజల నోటి ఆరోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని తెలిపారు. ప్రభుత్వ సంస్థలు పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించకపోవడం ఆమోదనీయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.